ప్రజాశక్తి – మండపేట : స్థానిక సంగమేశ్వర కాలనీ ప్రాథమిక పాఠశాలలో హోలీ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు తమ స్నేహితులు, ఉపాధ్యాయులకు రంగులను చల్లుతూ ఒకరికి ఒకరు హోలి శుభాకాంక్షలు తెలుపుకుంటూ తమ స్వచ్చమైన మనస్సుతో ఆనంద తన్మయత్వం చెందారు. చిరునవ్వులను చిందిస్తూ రంగేళిని ఎంతో ఉత్సాహంగా కేరింతల నడుమ జరుపుకున్నారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ మాట్లాడుతూ హోలీ పండుగను కాముని దహనం అని కూడా అంటారని, హోలి పండుగ దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో ఇది ఒకటి అన్నారు. ఈ పండుగ సత్యయుగం నాటి నుంచి జరుపుకుంటున్నారంటూ, హిందు పురాణాల ప్రకారం హోలీ అనగా అగ్నితో పునీతమైనదంటూ మనలోని చెడు కోరికలను దహింప చేసుకొని, సమాజ హితాన్ని కోరుతూ మతసామరస్యాన్ని పెంపొందింప జేసుకోవాలంటూ, అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
