ఇంటిపనిమనిషి గంగకు నష్టపరిహారం చెల్లించాలి : హోం మంత్రి అనిత

విశాఖ : రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం చేపట్టిన పటిష్టమైన చర్యలను అమలు చేయాల్సిన పోలీసులే గంగ అనే ఇంటిపని చేసుకునే మహిళపై అమానుషంగా, చట్టవ్యతిరేకంగా ప్రవర్తించి, స్టేషన్‌లో కొట్టి కాలు విరగ్గొట్టిన ఘటన జరిగి (4రోజులు అవుతున్నా) నేటికీ రాష్ట్ర ప్రభుత్వం, హోం మంత్రి అనిత స్పందించకపోవడాన్ని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. తక్షణం స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఆక్సిజన్‌ టవర్స్‌లో గంగ అనే మహిళ ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవిస్తుంది. ఆమెపై ఆ ఇంటి యజమాని ప్రియాంక నల్లపూసలు పోయాయని గంగ ఆ నల్లపూసలు దొంగతనం చేసిందని ఈ నెల 26న ఎంవిపి క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ పేరుతో గంగను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్ళి లాఠీతో కొట్టారు. గంగ ఎడమకాలు విరిగిపోయింది. నల్లపూసలు ఎక్కడ తాకట్టు పెట్టావో చెప్పాలని ఇద్దరు మహిళా కానిస్టేబుల్సు గంగ ఛాతిపై కూర్చొని ఆమె కదలకుండా కాళ్లు పట్టుకొని ఎస్‌ఐ నరవ జగదీష్‌ ఆమె అరికాళ్లపై లాఠీతోనూ, పైపుతోనూ విపరీతంగా కొట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో సక్రమంగా విచారణ జరపకుండా ఆ అభాగ్యరాలిపై పోలీస్‌లు దాష్టికం చేశారు. విశాఖపట్నంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో హోం మినిష్టర్‌ అనిత జోక్యం చేసుకొని పోలీసులను తక్షణమే సస్పెండ్‌ చేయాలని, క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల వల్ల కాళ్లు విరిగిన గంగకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. తప్పుడు కేసు పెట్టిన ఇంటి యాజమానురాలు ప్రియాంకపై చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆక్సిజన్‌ టవర్స్‌లో వేధింపులకు గురవుతున్న ఇంటిపనివారల కోసం ప్రత్యేక గ్రీవెన్‌ సెల్‌ పోలీసులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి పి.మణి, జిల్లా కమిటీ సభ్యులు వి.కఅష్ణారావు, ఇంటిపనివారల సంఘం నాయకులు కె.కుమారి, మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శి పి.వెంకటరావు, అధ్యక్షులు జె.ఆర్‌.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️