ప్రజాశక్తి – కడప : కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అండర్- 12 క్రికెట్ మ్యాచ్ లు హోరా హోరీగా సాగుతున్నాయి. శుక్రవారం వైఎస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చిత్తూరు జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో నెల్లూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన చిత్తూరు జట్టు 35.0 ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ జట్టులోని లిఖిత్ ఇరగం రెడ్డి 61 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని పార్థివ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 158 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నెల్లూరు జట్టు 33.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టులోని జాన్సన్ 55 పరుగులు చేశాడు.
అనంతపురం పై విజయం సాధించిన కర్నూలు జట్టు.
కే ఓ ఆర్ ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో అనంతపురం జట్టుపై ఒక వికెట్ తేడాతో కర్నూలు జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 33.0 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మోక్షజ్ఞతేజ్ 36 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని యశ్వంత్ సూర్య తేజ 5 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 108 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కర్నూలు జట్టు 29.0 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ఆ జట్టులోని రేవంత్ 27 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని ఉత్తేజ్ యాదవ్, హేమచంద్ర నాయక్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.