- మారేపల్లిలో ‘ఉపాధి’ కూలీల వినూత్న నిరసన
ప్రజాశక్తి- దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా) : ‘ఉపాధి బిల్లులు చెల్లించకపోతే గడ్డి తిని బతకాలా’ అంటూ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం దేవరా పల్లి, గర్సింగి, తేనుగుబూడి, డొర్రచెరువు, మారేపల్లి గ్రామాల ఉపాధి హామీ కూలీలు మారేపల్లిలో మంగళవారం చేతులతో గడ్డి పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాల వరకూ బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పోరాటానికి ఎపి వ్యవసాయ కార్మిక సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి డి.వెంకన్న, ఉపాధ్యక్షులు బిటి.దొర మద్దతు తెలిపి మాట్లాడారు. సమ్మర్ అలవెన్సులు, పే స్లిప్పులు, పెండింగ్ బకాయిల చెల్లింపులు వంటి డిమాండ్లపై ఈ నెల 12న తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామాల నుంచి వలసలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పేదల కోసం తెచ్చిన ఉపాధి హామీ చట్టం అమలులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. వంద రోజుల పనిదినాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఎండా కాలంలో నేల గట్టిగా మారడంతో ఉపాధి కూలి గిట్టుబాటు కావడం లేదన్నారు. రాజకీయ జోక్యం పెరిగి కూలీలకు మస్తర్లు ఇవ్వకుండా కొందరు నాయకులు చేస్తున్నారని తెలిపారు. పేదలకు వరంలాంటి ఉపాధి హామీ చట్టాన్ని అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై చట్ట స్ఫూర్తిని నీరుగార్చడం శోచనీయమన్నారు.