ప్రజాశక్తి- సంతమాగులూరు: మండలంలోని సంతమాగులూరు సబ్ డివిజన్ పరిధిలోని సంతమాగులూరు మేజర్ కాలువ అధ్వానంగా మారింది. నాచు, గడ్డి పెరిగిపోయి నీరు ప్రవహించడం గగనంగా మారింది. దీంతో కాలువ చివర వరి సాగు చేసిన రైతులకు సాగునీరు అందక ఆందోళన చెందుతున్నారు. ఈ మేజర్ కాలువ అడవి పాలెం గ్రామ సమీపంలో ఉన్న అద్దంకి బ్రాంచ్ కెనాల్ నుంచి విడిపోయి 15 కిలోమీటర్లు ప్రయాణించి బండివారిపాలెం వద్ద ముగుస్తుంది. గత సంవత్సరం సాగునీరు లేనందున రైతులు మాగాణి భూమి సాగు చేయలేదు. రైతులు మెట్ట పంట వైపు మొగ్గు చూపారు. అయితే ఈ ఏడాది పుష్కలంగా సాగునీరు రావటంతో రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు. అయితే ఈ మేజర్ కాలువ నాచు, గడ్డితో నిండిపోయింది. దీంతో దిగువన వరి సాగుచేసిన భూమికి సాగునీరు అందటం లేదు. ఈ కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడంతో సాగునీరు దిగువకు వెళ్లడం లేదు. దీంతో వేసిన వరి నాట్లు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఈ మేజర్ కాలువ కింద రైతులు 7,980 ఎకరాలలో సాగు చేశారు. అందులో మాగాణి 3,400 ఎకరాలు, మెట్ట 4,580 ఎకరాలలో సాగు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువలో పేరుకుపోయిన నాచును, అల్లుకుపోయిన గడ్డిని వెంటనే తొలగించి చివరి సాగు భూములకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.