భారీగా పెరిగిన పోలింగ్‌ !

May 15,2024 00:56

 ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో రికార్డు స్థాయిలో 85.69 శాతం పోలింగ్‌ జరిగింది. ఇంత భారీగా పోలింగ్‌ జరగడంపై వైసిపి, టిడిపి నాయకులకు ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో భారీగా ఘర్షణలు జరిగినా పోలింగ్‌ శాతం అనూహ్యంగా పెరిగింది. గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలో 17 లక్షల 91 వేల 543 మంది ఓటర్లు ఉండగా 14 లక్షల 12 వేల ముగ్గురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 78.91 శాతం పోలింగ్‌ నమోందైంది. పల్నాడు జిల్లాలో మొత్తం 17 లక్షల 34 వేల 858 మంది ఓటర్లుండగా 14 లక్షల 86 వేల 594 మంది ఓటేశారు. ప్రధానంగా పెదకూరపాడు నియోజకవర్గంలో 89.18 శాతం పోలింగ్‌ జరగడంపై టిడిపి,వైసిపి నేతలు ఎవరికి వారు తమకు అనుకూలంగా ఓటర్లు స్పందించారని చెప్పు కుంటున్నారు. చిలకలూరిపేటలో 85.44, నర్సరావుపేట 81.06, సత్తెనపల్లి 86.97, వినుకొండ 89.22 శాతం, గురజాల 84.30,మాచర్ల 84.30 శాతం పోలింగ్‌ జరిగింది. పల్నాడులో టిడిపి, వైసిపి ఢ అంటే ఢ అనే పరిస్థితుల్లో అత్యధికంగా పోలింగ్‌ జరగడంపై ప్రభుత్వ సంక్షేమపథకాలకు ప్రజలకు సానుకూలంగా స్పందించి తమ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపిస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పారు. అయితే ప్రజలుపెద్ద సంఖ్యలో తరలివచ్చి టిడిపికి అనుకూలంగా ఓటు వేసి తమ పార్టీని అధికారంలోకి తీసుకువస్తున్నారని, వైసిపి ప్రభుత్వానికి ఉన్నవ్యతిరేకత ఇందుకు నిదర్శనమని మాచర్ల అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతమైన మంగళగిరి, తాడికొండలో కూడా 80 శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది. రాజధాని మార్పును వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ప్రజలు తమ ఓటు ద్వారా స్పందించారని తాడికొండ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. గుంటూరు జిల్లాల ప్రధానంగా టిడిపి, వైసిపి మధ్య తీవ్ర పోటీ జరిగింది. దీంతో మొత్తం గ్రామాలు, మండలాల వారీగా గతంలో పోలయిన ఓట్లు, ఈ సారి పోలయిన ఓట్లు, వివిధ సామాజిక వర్గాల్లో వచ్చిన మార్పు తదితర అంశాలపై టిడిపి, వైసిపి నేతలు అంచనాల రూపకల్పనలో నిమగమయ్యారు. మెజార్టీ నియోజకవర్గాల్లో టిడిపి, వైసిపి హోరాహోరీగా తలపడ్దాయి. తెనాలి, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడులో గతంలో జనసేనకు పడిన ఓట్లు ఈసారి టిడిపితో కలవడం వల్ల తమకు లాభించిందని టిడిపి నాయకులు సంబరపడుతున్నారు. పోలింగ్‌ 80 శాతం దాటితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా ఉన్నట్టేనని టిడిపి అంచనా వేస్తుంది. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలవల్లే ఎక్కువ శాతం పోలింగ్‌ జరిగిందని ఇది తమకు సానుకూల ఫలితాలకు సంకేతమని వైసిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. 2019లో మాదిరిగానే వైసిపికి 12 నుంచి 15 సీట్లు వస్తాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. టిడిపి మాత్రం తమకు 1994 ఫలితాలు పునరావృత్తం అవుతాయని చెబుతోంది. అయితే పల్నాడులో గతంలో కంటే భిన్నంగా టిడిపి, వైసిపి మధ్య హోరాహోరీగా ఘర్షణలు జరిగాయి. తమపార్టీ గెలుస్తుందన్న భావనతో టిడిపి కార్యకర్తలు వైసిపితో ఢ అంటే ఢ అనే స్థాయికి వెళ్లడం, కొన్ని గ్రామాల్లో టిడిపి వారే వైసిపివారిపై ముందుగా దాడులు చేయడం ఆపార్టీలో పెరిగిన ధీమాకు తార్కారణంగా నిలుస్తోంది. ప్రస్తుతం శాంతిభద్రతలను కాపాడటంతో పోలీసు అధికారులు ఎన్నికల కమిషన్‌ విఫలమయ్యాయని మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు నంబూరు శంకరరావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట లోక్‌సభ వైసిపి అభ్యర్థి అనిల్‌కుమార్‌ ధ్వజమెత్తారు. టిడిపివారు కూడా ఎన్నికల కమిషన్‌ పటిష్టమైన చర్యలు తీసుకోలేదని, పోలీసు అధికారులు శాంతిభద్రతలను కాపాడలేకపోయారని విమర్శించారు. గెలుస్తుందన్న ధీమాతో ఘర్షణల ద్వారా పోలింగ్‌ శాతం తగ్గించేందుకు కుట్ర జరిగిందని వైసిపి ఆరోపించగా ఓటమి భయంతోనే వైసిపి ఈవిఎంలను కూడా ధ్వంసం చేసిందని టిడిపి ఆరోపించింది.

➡️