బొబ్బిలిలో భారీ చోరీ

Feb 2,2025 21:05

రూ.20 లక్షలు నగదు, 40 తులాల బంగారం అపహరణ

ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి పట్టణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. రూ.20 లక్షల నగదు, 40 తులాల బంగారాన్ని దుండగులు అపహరించారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలో సాయికృష్ణ జువెలరీ షాపు యజమాని గ్రంధి రవి కుంభమేళాకు వెళ్లేందుకు శనివారం సాయంత్రం విశాఖలోని బంధువుల ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లారు. శనివారం రాత్రి దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, రూ.20 లక్షల నగదు, 40 తులాల బంగారు నగలను అపహరించుకుపోయారు. ఇంటి పని మనిషి ఇంటి వైపు వెళ్లి చూడగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో యజమానికి ఫోన్‌ చేసి చెప్పారు. వెంటనే ఆయన ఇంటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డిఎస్‌పి భవ్యరెడ్డి, పట్టణ సిఐ కె.సతీష్‌ కుమార్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గ్రంధి రవి ఇంటి కంటే ముందు మరో ఇంట్లో చోరీ చేసేందుకు ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో రవి ఇంట్లో దొంగతనానికి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయనగరం నుంచి క్లూస్‌ టీమ్‌ వచ్చి ఆధారాలు సేకరించారు. సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని డిఎస్‌పి భవ్యరెడ్డి చెప్పారు.

➡️