హాస్టల్‌ విద్యార్థుల సమస్యలపై నిరాహార దీక్ష

రిలే నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు, ఎఐఎస్‌ఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి -అనకాపల్లి

రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి ఈనెల 27 నుంచి 29 వరకు రిలే నిరాహార దీక్షలకు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం అనకాపల్లి జిల్లా నాలుగు రోడ్లు జంక్షన్‌ వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి జి. ఫణీంద్ర కుమార్‌ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై సర్వే చేసి గుర్తించామని చెప్పారు. అనకాపల్లి జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో చేసిన సర్వేలో హాస్టళ్లు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని గుర్తించినట్లు చెప్పారు. హాస్టల్‌ భవనాలు శిధిలావస్థకు చేరి పెచ్చులు ఊడిపోతూ వర్షానికి కారిపోతుండడంతో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి హాస్టళ్లను తక్షణమే పునర్నిర్మించాలన్నారు. అద్దె భవనంలో ఉన్న హాస్టళ్లలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, గదులు లేక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని, వాటికి సొంతభవనాలు నిర్మించాలని కోరారు. గిరిజన వసతి గృహాలలో వర్కర్ల పోస్టులు భర్తీ చెయ్యకపోవడంతో, విద్యార్థుల మెస్‌ ఛార్జీల నుంచి వర్కర్లకు జీతాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు, కాస్మోటిక్‌ చార్జెస్‌ పెంచాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బి.బాబ్జి మాట్లాడుతూ గత ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉన్న మెస్‌ బిల్లులు, కాస్మోటిక్‌ చార్జీలు విడుదల చేయాలని, అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు జగదీష్‌, సింహాద్రి, సతీష్‌, సుదీర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️