ప్రజాశక్తి – సాలూరు : హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలని, గిరిజనులను భయభ్రాంతులకు గురిచేయడం ఆపాలని సిపిఎం జిల్లా నాయకులు రెడ్డి వేణు డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యాన బాధిత గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్డి వేణు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హైడ్రో పవర్ ప్రాజెక్టును ఈ ప్రాంతంలో నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో సుమారు 7 గిరిజన గ్రామాలు వందలు ఎకరాలు సాగు భూమి మునిగిపోతాయని, వారి జీవన విధానం అస్తవ్యస్తంగా మారిపోతుందని తెలిపారు. అదానీతో ఒప్పందాలను అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో అదానీ కంపెనీకి చెందిన కొంతమంది వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు కలిసి గ్రామాల్లో తిరుగుతూ గిరిజనులను పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎందుకు ఉన్నారని, ఇక్కడ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తామనిఅడ్డుకోవద్దని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇచ్చిన అనుమతులను రద్దుచేసి గిరిజనులకు రక్షణగా ఉండాలని కోరారు. వీరి జీవన విధానాలను, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా అవినీతి, అక్రమాల పైన కేసులు నమోదవుతున్నా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదానీకి అడవులను, నదులను సహజ వనరులను అప్పగించాలనుకోవడం సరికాదని చెప్పారు. కార్పొరేట్లకు అనుకూలంగా ఊడిగం చేసేలా ఉండడం సరికాదన్నారు. గిరిజనులకు రక్షణగా నిలబడాలని ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, గిరిజన సంఘం నాయకులు అయోధ్య, సీదరపు కాముడు, శంకర్రావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
