మాచర్లలో తీవ్రఉద్రిక్తత

May 15,2024 00:45

బారీకేడ్లు పెట్టి పహారా కాస్తున్న పోలీసులు
ప్రజాశక్తి – మాచర్ల :
అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమైన మాచర్లలో టిడిపి-వైసిపి ఘర్షణలు కొనసాగుతున్నాయి. కారంపూడిలో మంగళవారం ఘర్షణ నేపథ్యంలో మాచర్లలో కూడా ఘర్షణ జరుగుతాయేమోనని ఎమ్మెల్యే ఇంటిదగ్గర భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటల సమయంలో మాచర్ల పరిసర గ్రామాల నుండి వైసిపి నాయకులు కార్యకర్తలు కారంపూడికి వెళ్లారు. వీరంతా తిరిగి మాచర్లకు వచ్చారని, ఇక్కడ కూడా దాడులకు యత్నిస్తున్నారని ప్రచారం జరిగింది. మరోవైపు వెల్దుర్తి నుండి టిడిపికి చెందినవారూ వస్తున్నారని పుకార్లు బయలుదేరడంతో పట్టణంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎనిమిది గంటలకే వ్యాపారులంతా దుకాణాలను మూసివేసివెళ్లిపోయారు. ఈ ఘర్షణల వల్ల తమకేం జరుగుతుందోనని టిడిపి,వైసిపిలకు చెందిన సాధారణ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు స్థానిక బస్టాండ్‌ సెంటర్లో బారీకేడ్లు పెట్టి ఎమ్మెల్యే ఇంటి వైపే కాకుండా బస్టాండ్‌లోకి కూడా వాహనాలను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ప్రయాణికులు బస్టాండ్‌ నుండి బయటకు వచ్చి మెయిన్‌ రోడ్డుపై ఆగి ఉన్న బస్సులకి ఎక్కి వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులతోపాటు వైసిపి కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో మొహరించారు. ఇరు పార్టీల నాయకులకు చెందిన ఇళ్ల వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

➡️