ప్రజాశక్తి- శృంగవరపుకోట : ఐఎఎస్ అధికారి, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ తెలంగాణ రాష్ట్రం ముఖ్య కార్యనిర్వాహణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఐఎఎస్ అధికారి లోతేటి శివశంకర్‌కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన లోతేటి సన్యాసప్పుడు (78) శనివారం సాయంత్రం ధర్మవరంలో కనుమూశారు. సన్యాసప్పుడు వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్ సూపర్‌వైజర్‌గా ఉద్యోగం చేశారు. ఆయన కుమారుడైన శివశంకర్ శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఎ పిఒగా, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. జిల్లాల విభజన తర్వాత పలనాడు జిల్లాకు తొలి కలెక్టర్‌గా, తరువాత కడపజిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ తెలంగాణ రాష్ట్రం ముఖ్య కార్యనిర్వాహణ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. సన్యాసప్పడు అంత్యక్రియలు ఆదివారం ఉదయం 11 గంటలకు ధర్మవరంలో నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.