ప్రజాశక్తి-వంగర : గత కొద్ది రోజులుగా ఉదయం 9 గంటల వరకు దట్టంగా మంచు కురుస్తోంది. దాని ప్రభావం జీడి, మామిడి పూతపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జీడి, మామిడి పూత ఇంతవరకు సరిగా రాలేదు. దీంతో పంట నష్టం తప్పదని జీడి, మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బంగారువలస, కొండ చాకరాపల్లి, వంగర, కొప్పరవలస, వివిఆర్ పేట, రాజుల గుమ్మడ తదితర గ్రామాల్లో సుమారు 400 ఎకరాలకు పైబడి జీడి, మామిడి తోటలు ఉన్నాయి. ఈ తోటలు సాగు చేస్తున్న వారంతా పేదలే. ఏడాదికి ఓసారి వచ్చే ఈ జీడి, మామిడి పంటను కోసం వారంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పంటలను సాగు చేసుకుంటూ వారు జీవనం సాగిస్తూ ఉంటారు. గత ఏడాది ఇదే సమయానికి జీడి, మామిడి తోటలు ఎక్కువగా పూత పూయడంతోపాటు కాయలు ఉండేవని, చివరిలో పంట దిగుబడి కూడా బాగుందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది చూస్తే ఫిబ్రవరి నెల మొదలైనా ఇంతవరకు కూడా జీడి, మామిడి తోటలు పూత కూడా రాని పరిస్థితి నెలకొంది. పూత కొంతమేర కొన్నిచోట్ల వచ్చినప్పటికీ గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న మంచు ప్రభావంతో పూత మాడిపోతుందని రైతులు వాపోతున్నారు.అకాల వర్షాలే కారణం..?సహజంగా జీడి, మామిడి పూత డిసెంబర్ నెలలో వస్తుంది. అయితే డిసెంబర్ నెలలో రెండుసార్లు అల్పపీడన ప్రభావంతో సుమారు 15 రోజుల వరకు వర్షాలు కురిసాయి. ఇదే పూత ఆలస్యానికి కారణమని సంబంధిత ఉద్యాన శాఖ శాఖ అధికారులు చెబుతున్నారు.అవగాహన కల్పిస్తున్నాం ఇటీవల కురుస్తున్న మంచు వల్ల జీడి, మామిడి పూత విచ్చుకునే దశలో నష్టం జరుగుతుంది. ఇప్పటికే రెండు మూడు సార్లు మందులు పిచికారీ చేస్తే ఇబ్బంది ఉండదు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాం. – ఉమామహేశ్వరి, ఉద్యాన శాఖ అధికారి, వంగర మండలం
