మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి సోయగం
మైమరిచిపోతున్న ప్రకృతి ప్రేమికులు, సందర్శకులు
ప్రజాశక్తి -సీలేరు: సీలేరు సమీపంలోని ఐస్ గెడ్డ జలపాతం అందాలు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికుల మనస్సులను దోచుకుని మైమరిపించ జేస్తున్నాయి. ఇటివల కురిసిన భారీ వర్షాలకు ఎత్తైన కొండలపై నుంచి తెల్లనిపాల నురగను తలపించేలా జాలువారే జలపాతాలు ఉరకలేస్తూ కిందకు దూకుతుండడంతో, ఆ సోయగాలు చూసి, సందర్శకులు వింత అనుభూతిని పొందుతున్నారు. చింతపల్లి నుంచి దారి పొడవునా ప్రకృతి సోయగాలతో పాటు పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు ధారాలమ్మ ఘాట్ రోడ్లో రైన్ గేజ్ వద్ద మంచు అందాలు చూపరుల మనసులను హత్తుకుంటున్నాయి. దారాలమ్మ ఆలయానికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు ఆలయానికి సమీపంలో ఎత్తైన కొండల నడుమ జాలువారే జలపాతాలు, సుందర దృశ్యాలను తమ కెమెరాలలో బంధిస్తూ, సెల్ఫీలను తీసుకుంటూ మంత్రముగ్ధులై సందడి చేస్తున్నారు. . ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత తీర్చిదిద్దితే సందర్శకుల తాకిడి మరింత పెరుగుతుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, అల్లూరి జిల్లా మన్యం ప్రాంతంలో ప్రకృతి సుందరమైన ప్రదేశాలను, ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దాలని పలువురు కోరుతున్నారు.
ఐస్‌గెడ్డ జలపాతం వద్ద పర్యాటకుల సందడి