వికలాంగ విద్యార్థుల గుర్తింపు

Jun 8,2024 00:00 #identification, #Phc
Phc Identification

ప్రజాశక్తి -యంత్రాంగం పద్మనాభం : ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఆదేశాల మేరకు బడి బయట ఉన్న 0 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 21 రకాల వైకల్యాలు కలిగిన విద్యార్థుల గుర్తింపును అధికారులు చేపట్టారు. బడిలో వారి పేర్లు నమోదు చేస్తున్నారు. పద్మనాభం మండలంలో ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా మే 1వ తేదీ నుంచి చేపట్టారు. రెడ్డిపల్లిలో చేపట్టిన ఈ గుర్తింపు కార్యక్రమాన్ని శుక్రవారం సమగ్ర శిక్షా జిల్లా సహిత విద్యా సమన్వయాధికారి బి.గీత, మండల విద్యాశాఖాధికారి పొన్నగంటి రమణ పర్యవేక్షించారు. గ్రామాల్లో గుర్తించిన వికలాంగ విద్యార్థులకు మండల కేంద్రంలోని భవితా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను, చదువు వల్ల కలిగే ప్రయోజనాలను, ఫిజియోథెరపీ సేవలను, ప్రభుత్వం ద్వారా వచ్చే ఉపకార వేతనాల గురించి వివరించారు. ట్రాన్స్‌పోర్ట్‌, ఎస్కార్ట్‌, రీడర్‌, హెచ్‌బిఇ, గర్ల్‌ చైల్డ్‌ అలవెన్స్‌లను ఒక ఏడాదికి రూ.3000 చొప్పున ఇవ్వనున్నట్లు తల్లిదండ్రులకు వివరించారు. ఈ సర్వేలో ఇప్పటివరకు 20 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సర్వే ఈ నెల 9వ తేదీ వరకూ జరుగుతుందని చెప్పారు. సర్వేలో సమగ్ర శిక్షా ఎపిఒ అప్పలనాయుడు, ప్రత్యేక ఉపాధ్యాయులు హెచ్‌.రాజ్‌కుమార్‌, ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆనందపురం: ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు, నమోదు కార్యక్రమంలో భాగంగా దుక్కవానిపాలెంలో శుక్రవారం ఆనందపురం మండల సహిత విద్యా విభాగం ఉపాధ్యాయులు కలమట శ్రీనివాసరావు, ఐ.నాగమణి నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా సహిత విద్యా విభాగం సమన్వయకర్త బి.గీత పర్యవేక్షించారు. వికలాంగ పిల్లలను పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోపరుచుకోవాలని కోరారు.

➡️