ఇసుకపై అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ అరుణ్‌బాబు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వర్షా కాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోనున్న నేపథ్యంలో జూన్ 1 నాటికి జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేయాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. నరసరావుపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక నిల్వకు స్టాక్ పాయింట్లను గుర్తించాలని, అన్ని స్టాక్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇసుక రీచ్‌లలో తవ్వకాల కోసం ఏజెన్సీల నియామకం ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ముందుగా దిడుగు-1 రీచ్‌లో ప్రయోగాత్మకంగా నామినేషన్ విధానంలో ఏజెన్సీని నియమించాలని, ఈ విధానం ఫలితాన్ని బట్టి మిగిలిన రీచ్‌లలో ఏజెన్సీల నియామకంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జిల్లాలోని 5 ఇసుక రీచ్‌లలో అక్టోబరు వరకు తవ్వకాలకు పర్యావరణ శాఖ నుంచి అనుమతి లభించిందని, 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకానికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అంబడిపూడి – 1, 2, 3 రీచ్‌లు, కోనూరు -1 రీచ్‌లలో అక్టోబరు 22 వరకూ దిడుగు -1 రీచ్‌లో డిసెంబరు 30 వరకూ ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్నట్లు తెలిపారు. రీచ్‌ల పర్యవేక్షణకు ఇన్‌ఛార్జులను నియమించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా మైన్స్-జియాలజీ అధికారి నాగిని, ఆర్డీవో రమణాకాంత్‌రెడ్డి, జిల్లా రవాణా అధికారి సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.
పిజిఆర్‌ఎస్ కు 410 వినతులు
ప్రజా సమస్యలను సొంత సమస్యగా భావించి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, 48 గంటల్లోగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నరసరావుపేట నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక టౌన్‌హాల్‌లో నిర్వహించగా కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజరు గనోరే, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, డిఆర్‌ఒ మురళి, ఆర్‌డిఒ మధులత తదితరులు ఫిర్యాదులు స్వీకరించారు.
ట్రాన్సిషన్ విద్యా విధానం ద్వారా మెరుగైన ఫలితాలు
ట్రాన్సిషన్ విద్యా విధానం విద్యార్థులు ఉపాధి అవకాశాలు అందుకోవడంలో విజయవంతమైన మార్గం నిర్మించడంలో సహాయపడుతుందని కలెక్టర్ చెప్పారు. నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్డులోని మున్సిపల్ బాలుర పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రాన్సిషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి విద్యార్థులతోపాటు కూర్చుని పాఠాలు విన్నారు. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో డిఇఒ ఎల్.చంద్రకళ, ఆర్‌డిఒ మధులత, తహశీల్దార్ కె.వేణుగోపాలరావు,హెచ్‌ఎం రవికాంత్ పాల్గొన్నారు.
