తాడికొండకు సిఎం వరాలు ఇచ్చేనా?

Apr 14,2025 00:54

సిఎం సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ భార్గవ్‌తేజ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
తాడికొండ మండలం పొన్నెకల్లుకు వస్తున్న సిఎం చంద్రబాబు ఈ ప్రాంతానికి ఏమైనా హామీలిస్తారేమోననే ఆసకిసీ ప్రాంత వాసుల్లో నెలకొంది. తాడికొండ మండలంలోని పలు గ్రామాలకు తాగునీటి సమస్యలునున్నాయి. తాడికొండ గ్రామంలోనే ఇప్పటికి వారానికి ఒక రోజు నీటి సరఫరా అవుతోంది. గుంటూరు రాజధానికి నాలుగు లైన్ల రహదారి నిర్మాణం, విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. గుంటూరు-బౌద్ధారామం అమరావతి రహదారి విస్తరణ, అమరావతి-తుళ్లూరుకు నాలుగు లైన్ల రహదారి, గుంటూరు-గరికపాడు, పొన్నేకల్లు రహదారి అభివృద్ధి, తాడికొండ-కంతేరుకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా రాజధానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు 30 వేల ఎకరాలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం భూ సమీకరణ ద్వారానే ఈ భూములు తీసుకుంటుందనే ప్రచారమవుతోంది. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, పెదపరిమి, హరిశ్చంద్రపురం గ్రామాలతో పాటు పక్కనే ఉన్న తాడికొండ, మేడికొండూరు, అమరావతి మండలాలకు చెందిన గ్రామాల్లో 30 వేల ఎకరాలకు వరకు సేకరిస్తారనే ప్రచారం ఉంది. అయితే భూ సమీకరణ ప్రక్రియలో తీవ్ర జాప్యమవుతున్నందున తమకు 2013 భూ సమీకరణ చట్టం ద్వారా భూసేకరణ చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. రాజధానికి చుట్టూ నిర్మించే అవుటర్‌ రింగ్‌ రోడ్డు, పశ్చిమ బైపాస్‌, ఇంటర్నల్‌ బైపాస్‌ తదితర ప్రాజెక్టులకు భూములు తీసుకుంటారనే ప్రచారంతో రైతులు కంగారుపడుతున్నారు. మరోవైపుఈ ప్రాజెక్టుల వల్ల భూముల విలువ పెరుగుతుందని ఇప్పటికీ గుంటూరు రూరల్‌, తాడికొండ, అమరావతి, క్రోసూరు, సత్తెనపల్లి తదితర మండలాల భూముల క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. తాడికొండ మండలంలో ఎకరం రూ.3 కోట్ల వరకు పలుకుతోంది. ధరలు భారీగా పెరిగిన నేపధ్యంలో క్రయ విక్రయాలు కూడా తగ్గాయి. దీంతో రియల్టర్లు, మధ్యవర్తులు రాజధానికి దూరంగా ఉన్న మండలాలపై దృష్టి కొనుగోలు దారులు దృష్టి సారించారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా వెలగపూడి విజయవాడ రోడ్డు నాలుగు లైన్లగా విస్తరించడం ద్వారా ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించాల్సి ఉంది. జిల్లా కేంద్రం గుంటూరు, రాజధాని ప్రాంతంలో పేరెన్నికగన్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడతాయని చెబుతున్నారు. 20 వేల జనాభా కల్గిన తాడికొండలో 100 పడకల ఆస్పత్రి నిర్మించాల్సిన అవసరం ఉంది. తాడికొండలో ప్రభుత్వ, ప్రైవేటు పరంగా ఆస్పత్రులు లేవు. నియోజకవర్గంలో విద్యా వైద్య సదుపాయాలతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధికి కృషి జరగాల్సి ఉంది.

➡️