ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఔను…! జిల్లాలో పేదల పేనాలు పోతున్నారు… ప్రజారోగ్యానికి చిల్లుపడుతోంది. అయినా సరే… ప్రభుత్వానికిగానీ, అధికార పార్టీకి గానీ పెద్దగా పట్టింపు ఉన్నట్టుగా కనిపించడం లేదన్న విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఫిర్యాదులు అందితే సంబంధిత ఆసుపత్రి యాజమాన్యాలపై జులుం ప్రదర్శించి, బెదిరింపు చర్యలకు పాల్పడడం తప్ప, న్యాయంగా ఆయా యాజమాన్యాలకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపునకు మాత్రం పూనుకోవడం లేదు. స్థానిక నాయకులకు రాజకీయ పలుకుబడి ఉంటే అరుదైన సందర్భాల్లో జోక్యం చేసుకుని సెటిల్‌మెంట్ చేయడం తప్ప అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం లేదు. ప్రతిపక్ష నాయకులు తమ సిఫార్సులతో రోగులకు పరోక్షంగా సాయపడడంమే గొప్పగా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ డొల్లతనం బయటపడడం సంగతి అటుంచితే, ప్రజారోగ్యం క్షీణిస్తోంది. వైద్యరంగం ప్రైవేటీకరణలో భాగంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని పాలకులు గొప్పగా చెప్పుకుంటారు. వైఎస్‌ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పథకం దేశానికే ఆదర్శమంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, మునుపుటి వైసిపి ప్రభుత్వాలు ప్రభోదించిన సంగతి విధితమే. తామేమీ తక్కువ కాదంటూ ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పుకుంటూ వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ, ఎన్‌టిఆర్ ఆరోగ్య శ్రీగా పేరు మార్చిన టిడిపి – జనసేన కూటమి ప్రభుత్వం ఆ పథకానికి నిధులు మాత్రం కేటాయించడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,500కోట్ల బకాయి ఉన్నట్టుగా సమాచారం. ఇందులో ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు వంద ఆసుపత్రులకు రూ.250కోట్ల వరకు బకాయి ఉన్నట్టుగా అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు భారీ మొత్తంలో బకాయిలు ఉండడం వల్ల ఆరోగ్య శ్రీ సేవలందించేందుకు కొన్ని యాజమాన్యాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఇదే సాకుతో రోగుల నుంచి భారీగానే డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కాస్త ఈ పథకంపై అవగాహన, చొరవ ఉన్నవారం ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చేరగలుగు తున్నారు. వివిధ రోగాలకు వైద్యసేవలు అందించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో అప్రూవల్ ఇస్తున్నప్పటికీ, సుమారు ఏడెనిమిది నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో యాజమాన్యాలు రోగులు పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జి ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జిల్లాలోని ఓ ఆస్పత్రిలో నిరుపేద వ్యక్తి ఊపిరి తిత్తుల సమస్యలతో చేరాడు. నాలుగు రోజుల తరువాత చనిపోయాడు. చేరిన సమయంలో ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని యాజమాన్యం చెప్పిందట. తీరా చనిపోయాక ఆరోగ్య శ్రీ డబ్బులు రాలేదు. కాబట్టి రూ.40వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ యజమాన్యం మెలికపెట్టింది. దిక్కుతోచని స్థితిలో గ్రామ స్థాయి నాయకుడు ఓ మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించాడు. ఆయనకు కాస్త రాజకీయ పలుకుబడి ఉండడంతో యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఆరోగ్య శ్రీ డబ్బులు రాకపోవడం వల్లే డబ్బులు అడిగామన్నది ఆ యాజమాన్యం వాదన. ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఆ యాజమాన్యానికి లేకపోవడం వల్ల శవాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిందన్నది ఇక్కడ స్పష్టంగానే అర్థమైంది. మరో కార్పొరేట్ ఆసుపత్రిలో గుండె జబ్బుతో చేరిన ఒక రోగికి కూడా ఇటువంటి అనుభవమే ఎందురైంది. ఎలాగూ ఆరోగ్య శ్రీ ద్వారా డబ్బులు రావడం లేదని భావించిన ఆ యాజమాన్యం కొన్ని మందులు రోగి కుటుంబ సభ్యులతోనే కొనిపించింది. ఇది చాలదన్నట్టు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడం వల్ల ఆ వైద్యసేవలకు తక్షణం రూ.50వేలు కట్టాలంటూ ఒత్తిడి చేసింది. ఆ కుటుంబం డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల నత్తే నయం అన్నట్టుగా అంతా బాగానే ఉందంటూ డిశ్చార్జి ఇచ్చేసింది. ఇలా ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యాలు వైద్యసేవలు అందించేందుకు నచ్చడం లేదు. తప్పని సరి పరిస్థితుల్లో చేర్చుకున్నా కనీసం మెయింటెనెన్స్ ఛార్జీలైనా లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఔను మరి…! డబ్బులు ఇవ్వకుండా ఎవరు మాత్రం వైద్యం చేస్తారు. ఎంత కాలం భరిస్తారు. దీన్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఇలాంటి సమస్యలు బయటపడిన ఆసుపత్రులపై బెదిరింపు చర్యలకు పాల్పడం తప్ప బకాయిలు చెల్లించడం లేదని ఆసుపత్రి యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పేనాలు పోతున్నా అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు రోగుల నుంచి వినిపిస్తున్నాయి.
