కార్యాలయం గేటుకు తాళం వేయడంతో బైటాయించిన కార్మికులు, నాయకులు
ప్రజాశక్తి – మంగళగిరి : ఎమ్‌టిఎంసి (మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ) పరిధిలో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడం దారుణమని, అయినా ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారా లోకేష్ పట్టించుకోకపోవడం ఏమిటని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. వెంటనే చెల్లించకుంటే కోర్టుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. జీతాల కోసం తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లు, జీతాలు పెంచాలని ఇంజినీరింగ్ విభాగం కార్మికులు మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్పొరేషన్ కార్యాలయం గేటు ఎదుట ధర్నా చేపట్టారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వైసిపి ప్రభుత్వం ప్రవేశపెటిన క్లాప్ ఆటోలను రద్దు చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని విమర్శించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కాకుండా మున్సిపల్ అధికారులే ఈ వాహనాలను నిర్వహించాలని, ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. 16 నెలలుగా చెల్లించాల్సిన ఇఎస్‌ఐ, పిఎఫ్ ఆటో డ్రైవర్ల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల ద్వారా డ్రైవర్లకు జీతాలను కార్పొరేషన్ అధికారులు ఇప్పించాలని కోరారు. కనీస వేతనం రూ.24,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లు ఒకేరకంగా వేతనాలు ఇవ్వడంలేదని, సమస్యను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఎలక్ట్రికల్ కార్మికుల జీతాలను జీవో 36 ప్రకారం ఇవ్వాన్నారు. గతంలో సమ్మె సందర్భంగా ప్రభుత్వ వేసిన 9 మంది కమిటీ తప్పులు తడకగా ఉందని, అప్కాస్‌ను రద్దు చేసి జీతాలను కాంట్రాక్టర్లు ఇవ్వడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, 62 ఏళ్ల వరకు ఉద్యోగాన్ని కొనసాగించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కమిషనర్ ఎస్.ఆలీమ్‌బాషాకు వినతిపత్రం ఇవ్వడానికి కార్మికులు, నాయకులు కార్యాలయం లోపలికి వెళ్తుండగా సిబ్బంది అడ్డుకుని గేటుకు తాళం వేశారు. దీంతో వారు గేటు ఎదుటే బైటాయించారు. కొద్దిసేపటికి వారిని కమిషనర్ పిలిపించడంతో లోపలికెళ్లి వినతిపత్రం ఇచ్చారు. వీలైనంత త్వరగా జీతాలిప్పించకుంటే లేబర్ కోర్టుకెళ్తామని, వేతనాలివ్వని కాంట్రాక్టర్‌కు నోటీసు ఇవ్వాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్.ఎస్.చెంగయ్య, వివి జవహర్‌లాల్, సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం.బాలాజీ, క్లాప్ ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు ఎం.రవి, డి.శివ, ఆర్.కృష్ణ, కె.నాగరాజు, జె.యోహాన్, కె.రాకేష్, జె.శ్రీకాంత్, పి.అహ్మద్‌ఖాన్, మున్సిపల్ యూనియన్ నాయకులు కె.శ్రీనివాసరావు, టివిఎస్ గోపి, ఎం.శ్రీనివాసరావు, కె.దుర్గారావు పాల్గొన్నారు.
