ప్రజాశక్తి – కడప అర్బన్ : అధికారం లోకి వచ్చి 9 నెలలు అవుతున్న పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వని కూటమి ప్రభుత్వం, కనీసం టిడ్కో ఇళ్లను మంజూరు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నగర శివాలయంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో నిర్మించిన టిట్కో ఇళ్లను సిపిఎం నాయకుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రామ మోహన్, జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించే బాధ్యత ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. టిట్కో ఇళ్ల కోసం లబ్ధిదారులు రూ. 25000, రూ.50 వేలు, లక్ష చొప్పున చెల్లించారని ఆ ఇల్లు పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేయాలని తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం లబ్ధిదారులు తో వేల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్ధిదారులను గుర్తించి ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లు స్థలాలు మంజూరు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు పేదలకు సెంటు స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. కడప నగరంలో వేలాది మంది పేదలు ఇల్లు లేక సొంత గూటి కోసం కళ్ళు కాయలు కాచే లాగా పేదలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. టిట్కో ఇళ్ల పైన జిల్లా ప్రజా ప్రతినిధులు శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టిట్కో ఇళ్ల స్థలాల కోసం రానున్న కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు, ఇల్లు లేని పేదలను సమీకరించి ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఈ పరిటాల కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి దస్తగిరి రెడ్డి స్థానిక పార్టీ నాయకులు గోవిందు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
