సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : ఎయిర్ పోర్టుల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ఉద్యోగాలిప్పిస్తామంటూ ఎవరైనా తారసపడితే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేదా నేరుగా తన దృష్టికి తేవాలని చెప్పారు. ఎమ్మెల్యే కార్యాలయ ఉద్యోగులమంటూ ఎవరైనా డబ్బులు వసూలు చేసినా, ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేయబూనుకున్నా తాట తీస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పట్టణంలోని 28వ వార్డులో అజ్మీర్ దర్గా ఉరుసు (గంధం) మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం శివాలయం సమీపంలోని వార్డు సచివాలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. బాధ్యతారహితంగా వ్యవహరించినా, ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. కార్యాలయ వేళల్లో విధులు నిర్వహించకుండా బయటకు వెళ్తే సస్పెండ్ చేస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.