రాత్రి 11గంటల తరువాత సంచరిస్తే చర్యలు : ఎస్‌పి

Mar 9,2025 20:55

ప్రజాశక్తి-విజయనగరంకోట :  సహేతుకమైన కారణం లేకుండా అర్ధరాత్రి పట్టణాల్లో తిరిగితే టౌన్‌ న్యూసెన్సు చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా జనవరి నుండి ఇప్పటి వరకు 850 మందిపై టౌన్‌ న్యూసెన్సు చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, కౌన్సిలింగు నిర్వహించినట్లు తెలిపారు. పెట్రోలింగు నిర్వహించే నమయాల్లో పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, అందుకు అనుగుణంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. విజయనగరంలో రైల్వేస్టేషను, ఆర్టీసి కాంప్లెక్స్‌, మూడు లాంతర్లు, కోట జంక్షన్‌, బాలాజీ జంక్షన్‌, దాసన్నపేట, రైతు బజార్‌, రింగు రోడ్డు, కొత్తపేట, ఐస్‌ ఫ్యాక్టరీ, జమ్ము, విటి అగ్రహారం, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాం మున్సిపాల్టీల్లో కొన్ని ముఖ్య ప్రాంతాల్లోను పోలీసులు తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. రాత్రి 11గంటల తరువాత వ్యాపారాలు, షాపులు, టిఫిన్‌ బండ్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకొంటూ, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యాపారాలు సాగించినా, సహేతుకరమైన కారణాలు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించిన వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలిస్తున్నామని తెలిపారు. వారిని పోలీసు స్టేషనుకు తరలించి, వారి తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సిలింగు నిర్వహిస్తున్నామని అన్నారు.

➡️