అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు సీజ్‌

ప్రజాశక్తి – మార్కాపురం రూరల్‌:  ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను గురువారం సాయంత్రం మార్కాపురం పోలీసులు సీజ్‌ చేశారు. స్థానిక తర్లుపాడు రోడ్డులోని డిఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కాపురం డీఎస్పీ యూ.నాగరాజు వివరాలు వెల్లడించారు. మార్కాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.సైదా బాబుకు వచ్చిన సమాచారం మేరకు, తన సిబ్బందితో కలిసి ఎస్టేట్‌లోని నరసింహా రావు ప్లాస్టిక్‌ గ్రానువల్స్‌ పేరు గల గోడౌన్‌లో తనిఖీ చేశారు. అక్కడ సుమారు రూ.1.5 లక్షల విలువైన దీపావళి క్రాకర్స్‌ను చిలకలూరిపేటలోని లక్ష్మి క్రాకర్స్‌ గోడౌన్‌ నుంచి మార్కాపురం పట్టణానికి చెందిన జ్వలిత్‌ అనే వ్యక్తి కొనుగోలు చేసి, మార్కాపురంలోని తన గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచారు. వీటిని ఎక్కువ ధరకు ప్రజలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు ప్రజలకు విక్రయిస్తున్నందున జ్వలిత్‌పై కేసు నమోదు చేసి, గోడౌన్‌ నుండి దీపావళి క్రాకర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గురువారం ఉదయం మార్కాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.సైదు బాబు తన సిబ్బందితో కలిసి, ఎస్టేట్‌ వై జంక్షన్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎస్టేట్‌ వైపు నుంచి మార్కాపురం పట్టణంలోకి వస్తున్న ఆటోలో సుమారు రూ.2 లక్షల విలువ గల దీపావళి క్రాకర్స్‌ను పట్టుకున్నారు. వీటిని మార్కాపురం పట్టణానికి చెందిన రమాకాంత్‌ అనే వ్యక్తి కొనుగోలు చేసి, వాటిని అక్రమంగా మార్కాపురం పట్టణానికి తీసుకొని వచ్చి అధిక ధరలకు ప్రజలకు విక్రయించుటకు తన ఆటోలో తీసుకు వస్తున్నట్లు ఆటో డ్రైవర్‌ అయిన బాషా చెప్పారు. డ్రైవర్‌ బాషాను, ఆటోతో పాటు అందులో ఉన్న దీపావళి క్రాకర్స్‌ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా అధిక మొత్తంలో టపాసులు నిల్వ ఉంచుకొని విక్రయాలు జరిపితే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.సుబ్బారావు, ఎస్‌ఐ ఎం.సైదా బాబు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️