20మంది విద్యార్థినులకు అస్వస్థత

Feb 4,2025 21:14

ప్రజాశక్తి-విజయనగరం కోట, టౌన్‌  : నగరంలోని సాంఘిక సంక్షేమ విద్యార్థినుల హాస్టల్‌ – 3లో సోమవారం భోజనం చేసిన 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆహారం కలుషితం కావడమే ఇందుకు కారణమని విద్యార్థినులు అంటున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురు విద్యార్థినుల్లో ముగ్గురు తిరుమల-మెడికవర్‌లోను, మరో ఇద్దరు జిల్లా కేంద్రాస్పత్రిలోను చికిత్స పొందుతున్నారు. ఈ హాస్టల్‌లో ఇంటర్‌, డిగ్రీ, నర్సింగ్‌ విద్యార్థులు ఉంటున్నారు. వీరికి ఆదివారం మధ్యాహ్నం హాస్టల్‌లో చికెన్‌, బిరియాని పెట్టారు. ఆరోజు రాత్రే ఆరుగురు విద్యార్థులకు విరేచనాలు కావడంతో ఆస్పత్రిలో చేరారు. మిగతా వారంతా ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవ్వంతో ఆస్పత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న రమ్య అనే విద్యార్థిని ఐసియులో చికిత్స పొందుతోంది. జనరల్‌ వార్డులో మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మిగతా వారంతా కోలుకొని హాస్టల్‌కు, తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అస్వస్థతకు గురైన వారిలో అంపోలు అలేఖ (ఇంటర్‌), బంకపల్లి దీపిక (నర్సింగ్‌), జస్విని, సింధూ తదితరులు ఉన్నారు.

విద్యార్థినులకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల పరామర్శ

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు డి రాము, సిహెచ్‌ వెంకటేశ్‌, జిల్లా ఉపాధ్యక్షులు వెంకి పరామర్శించారు. ఈసందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో పరిస్థితి రాను రాను అగమ్య గోచరంగా తయారవుతుందని విమర్శించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, హాస్టల్‌ వార్డెన్‌ల నిర్లక్ష్యం వల్ల విద్యార్థినులను ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చిందని అన్నారు. వారం రోజులుగా ఎస్‌ఎఫ్‌ఐ బృందం, విద్యార్థులు హాస్టల్‌ వార్డెన్‌ వద్ద ఎంత మొరపెట్టుకుంటున్న ఫుడ్‌ మార్చకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇద్దరి పరిస్థితి క్షీణించడంతో జనరల్‌ వాటి నుంచి ఐసియులోకి మార్చారని తెలిపారు. ఇంతటి పరిస్థితి జరుగుతున్నప్పటికీ హాస్టల్‌ సంక్షేమ అధికారిని విద్యార్థులను పరామర్శించకపోవడం అన్యాయమని అన్నారు. తక్షణమే డిడి హాస్పిటల్లో ఉన్న విద్యార్థులను పరామర్శించి వారికి మెరుగైన సౌకర్యం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఇంతటి ఘోరానికి కారణమైన వార్డెన్‌ రాధామణిపై తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే డిఇఒ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.

➡️