ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : గర్భవతులు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు శ్రీకాంత్, నాగార్జున తెలిపారు. స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్యాధికారులు శ్రీకాంత్, నాగార్జున ఆధ్వర్యంలో ఎఎన్‌ఎమ్, ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ … వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గర్భవతుల వివరాలు వంద శాతం నమోదు చేయాలని అన్నారు. గర్భవతులకు వ్యాధి నిరోధక, ధనుర్వాత టీకాలు పూర్తి చేయాలన్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు జీరో డోస్ పోలియో, బిసిజి టీకాలు వేయాలన్నారు. ప్రతి ఒక్క బిడ్డను 6,10,14వారాల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయాలని సూచించారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించేలా ప్రోత్సహించాలన్నారు. ఎన్ సిడి,సిడి సర్వే వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి శ్రీనివాసరెడ్డి, ఆశా నోడల్ అధికారి శోభాకుమారి, సూపర్ వైజర్ రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.