ప్రజాశక్తి – కడప అర్బన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏకీకత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) పథకం అమలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దానిని అంగీకరించే ప్రశ్నే లేదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీ రాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యుపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల అసంబద్ధ పని సర్దుబాటు విధానాన్ని నిరసిస్తూ డిఇఒ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కేవలం ఎన్‌పిఎస్ పేరును యుపిఎస్‌గా మార్చిందని ఆరోపించారు. 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు 50 శాతం పెన్షన్ గ్యారంటీ చేస్తున్నట్లు, సర్వీసులో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 60 శాతం ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామని యుపిఎస్ పెన్షన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో కూడిన పెన్షన్ పథకాన్ని రద్దు చేసే విషయాన్ని ఇందులో ప్రస్తావించకపోవడం, పైగా ఈ పథకం అమలు ఐచ్చికం అని పేర్కొనడంలోనే అసలు మోసం దాగి ఉందన్నారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ లేకుండా సర్వీ సును బట్టి 50 శాతం పెన్షన్ ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడమే తమకు ఆమోదయోగ్యమని వారు పేర్కొన్నారు. యుపిఎస్ అనేది కేవలం ఆంధ్ర ప్రదేశ్ అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ కాపీ అని, నూతన పెన్షన్ పథకం సంస్కరణకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వారు పేర్కొన్నారు. పాత పెన్షన్ పథకాన్ని పూర్తిగా పునరుద్ధరిడమే ఏకైక పరిష్కారమని వారు తెలిపారు. పాత పెన్షన్ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వారు హెచ్చ రించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల పని సర్దుబాటు అసం బద్ధంగా ఉందని వారు ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాల సూచనలను అమలు చేయకుండా ఇష్టానురాజ్యంగా వ్యవహరించడం తగదన్నారు. పని సర్దుబాటు ప్రక్రియను మండల పరిధి వరకే పరిమితం చేయాలని, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులను విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బి.చంద్రశేఖర్, గాజులపల్లె గోపీనాథ్, డి.కష్ణారెడ్డి, ఎం.సి.నాగన్న పాల్గొన్నారు. బద్వేలు : శుక్రవారం సాయంత్రం స్థానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద నుంచి ఆర్‌డిఒ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి, అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆర్‌డిఒ కార్యాలయ సూపరిండెంట్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు టి.శివప్రసాద్ బద్వేలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.దేవానందం, కె.సుధాకర్, గోపవరం మండలం అధ్యక్షుడు వీరదాసరి క్రిస్టఫర్ యుటిఎఫ్ బద్వేలు మండల సహాధ్యక్షుడు ఎం.నరేష్, ట్రెజరర్ ఎ.గుర్రయ్య, గోపవరం మండల ట్రెజరర్ ఎం.రామచంద్రయ్య జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎన్.పవన్ కుమార్, ఎస్.మస్తాన్ వలి, కె.ఈశ్వరయ్య, ఎం.శివకుమార్, టి.పెంచలయ్య, ఓబయ్య, నాగరాజు పాల్గొన్నారు.
