సమ్మె విరమించిన మున్సిపల్ పారిశుధ్య కార్మికులు
ప్రజాశక్తి – సాలూరురూరల్ : పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఆరు రోజులుగా స్థానిక మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఎట్టకేలకు శనివారం స్థానిక మున్సిపల్ ఇన్‌ఛార్జి ప్రసాదు, మేనేజర్ శివప్రసాదు, టిపిఓ ఝాన్సీ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాజీవ్ సమ్మె శిబిరం వద్దకు వచ్చి చర్చలు నిర్వహించారు. అనంతరం ఇన్‌ఛార్జి కమిషనర్ మాట్లాడుతూ ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు ఏప్రిల్ 15 లోపు కార్మికుల ఖాతాల్లో జమ చేసేలా బాధ్యత పడతామని, ఏప్రిల్, మే జీతాలకు బడ్జెట్ వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సమ్మె కాలాన్ని క్యాజువల్ లీవ్, బదిలీ రోజులు పని చేసేలా కార్మికుల నష్టపోకుండా సహకరిస్తామని తెలిపారు. టిడిపిఒ, మేనేజర్,శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కూడా కార్మిక సమస్యల పరిష్కారంలో ఇకపై నిర్లక్ష్యంగా ఉండమని, యూనియన్ కూడా సహకరించాలని కోరారు. ఈ మేరకు యూనియన్ కార్యదర్శి ఎన్వై నాయుడు, సాలూరు కమిటీ అధ్యక్షుడు కార్యదర్శులు రాముడు, శంకర్రావు మీడియా ఇంచార్జ్ రవి, మహిళా నాయకులు సీత, దేవి మాట్లాడుతూ అధికారుల హామీ మేరకు సమ్మెను విరమిస్తున్నామన్నారు. హామీని అమలు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.మున్సిపల్ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు స్థానిక మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆరు రోజులుగా చేపట్టిన సమ్మెకు నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయ కర్త గేదెల రామకృష్ణ శనివారం మద్దతు తెలిపారు. గత ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కార్మికుల సమ్మె శిబిరం వద్దకు వెళ్లి కాంగ్రెస్ ఒబిసి జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు కలిసి వెళ్లి రామకృష్ణ మద్దతు పలికారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలో పారిశుధ్య కార్మికులకు జీతాలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కోవడం దారుణమని అన్నారు. ప్రతి నెలా కార్మికులకు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.