కార్మికులకు ఎగ్గొట్టిన డబ్బు ఎవరి జేబుల్లోకి

Mar 22,2025 00:38

కార్మికుల నిరసనలో మాట్లాడుతున్న ఆంజనేయులు నాయక్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
పరిసరాల శుభ్రతకు పాటు పడుతున్న పారిశుధ్య కార్మికులు ప్రభుత్వ విధానాలు, అధికారుల నిర్లక్ష్య వైఖరితో శ్రమదోపిడికి గురవుతున్నారని సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయులు నాయక్‌ అన్నారు. వేతనాలు చెల్లించాలని అడిగినందుకు ‘మీకు వచ్చేది ఇచ్చేది అంతే.. ఇష్టమైతే రండి కష్టమైతే మానుకోండి..’ అని మున్సిపల్‌ కమిషనర్‌ చెప్పడాన్ని నిరసిస్తూ మున్సిపల్‌ కార్మికులు ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన నిరసన శుక్రవారం 2వ రోజుకు చేరింది. వీరికి మద్దతుగా ఆంజనేయులు నాయక్‌ మాట్లాడుతూ నెల రోజులు పని చేస్తే 15 రోజులకే వేతనాలిస్తూ అందులోనూ కోతలు విధిస్తున్నారని, ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయో తేల్చాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎమ్మెల్యే అరవిందబాబు జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలన్నారు. 35 మంది కార్మికులకు ఆప్కాస్‌లో ఆరేళ్లుగా పేర్లు నమోదైనా బదిలీ కార్మికులంటూ వేతనాలు సరిగా ఇవ్వడం లేదని తెలిపారు. మిగిలిన కార్మికులతో పాటు పిఎఫ్‌, ఇఎస్‌ఐ మినహాయిస్తున్నప్పటికీ వారితో పాటు వేతనాలు ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడాఇ్డరు. కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, ఇక్కడి సమస్యను రాష్ట్ర మున్సిపల్‌ వర్కర్స్‌ పరిపాలన అధికార దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్‌ పల్నాడు జిల్లా గౌరవాధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌, నాయకులు జీవరత్నం, వీరకుమార్‌, నరసింహరావు, నవీన్‌, కృపారావు, సమాధానం, ఇంద్రయ్య, జె.శ్రీను, దేవదానం, వీరయ్య, రాజు, ఖాదర్‌బాషా, సాంబయ్య, జగన్నాథం, సాల్మన్‌, నాగరాణి, మల్లేశ్వరి, వీరమ్మ, లత, నాగమణి, సెల్మి పాల్గొన్నారు.

➡️