ప్రజాశక్తి -పాలకొండ : స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వివిధ రూపాల్లో లక్షల రూపాయాల్లో ఆదాయం వస్తున్నా కాంప్లెక్స్ నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగానే ఉంది. ప్రయాణికులు వచ్చిపోతుంటారులే… మాకే నష్టంలేదునకుంటేన్నారో ఏమో అధికారులు. కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు సౌకర్యాలతో పాటు పరిసరాలను కూడా కనీసం పట్టించుకోవడంలేదు. ఏడాదికి రూ.12 కోట్ల ఆదాయం ఈ డిపో నుంచి వస్తున్నట్లు ఆర్టీసీ అధికారులే చెప్తున్నారు. షాపుల ద్వారా లక్షల్లో ఆదాయం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వచ్చాయి. సుమారు 10 షాపు నుంచి నెలకు రూ.6 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. ఖాళీ స్థలం లీజకు ఇవ్వడంలో మరో అదనంగా 50 వేల వరకు వస్తుంది. ఈ డిపోలో 73 ఆర్‌టిసి బస్సులు, 18 అద్దె బస్సులు ఉన్నాయి. మొత్తంగా 91 సర్వీసులు ఈ డిపో పరిధిలో నడుస్తున్నాయి. రోజుకు వేలాదిమంది ప్రయాణికులు ఈ కాంప్లెక్స్ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇంత ఆదాయం వస్తున్నా కాంప్లెక్స్‌ను మాత్రం అభివృద్ధి చేసిన దాఖలాల్లేవు. కాంప్లెక్స్ చుట్టూ ఉన్న చెట్లు పూర్తిగా ఎండిపోయి ప్రయాణికులకు చాలాదనాన్ని ఇవ్వడం పక్కన పెడితే ఎప్పుడు, ఎవరిపై కూలిపోయి ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదంపై పలువురు ఎన్నిసార్లు అధికారుల దృష్టి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రయాణికులకు అరకొర సౌకర్యాలు లభిస్తున్నాయి. కనీసం కూర్చోవడానికి బెంచీలు లేవు. లేవు ఫ్యాన్లు తిరగవు. మరుగుదొడ్లు ఉన్నా నీటి సదుపాయం లేకపోవడంతో నిరుపయోగంగానే ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేటు దగ్గర ఆద మరిస్తే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అక్కడ ఉన్న కల్వర్టు పూర్తిగా పాడవ్వడంతో ప్రయాణికులు ప్రమాదాలబారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియక ప్రయాణికులు భయపడుతున్నారు. కాంప్లెక్స్‌కు వచ్చే వృద్ధులు, చిన్నారులు కూడా దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్‌టిసి అధికారులు స్పందించి కాంప్లెక్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పించి, సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
