డ్రోన్ల వినియోగం పెంచండి

Sep 29,2024 00:09

సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి చంద్రశేఖర్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి:
గత రెండేళ్లలో రైతులకు ఏం చేశారు? రాబోయే రెండేళ్లలో ఏం చేయబోతున్నారు? అనే అంశాలపై ప్రణాళిక సిద్ధం చేయాలని, డ్రోన్ల ద్వారా సీడింగ్‌ కౌటింగ్‌, ఎరువులు, పురుగుమందుల పిచికారి జరగాలని, ప్రతి మండలంలో మూడు డ్రోన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆదేశించారు. లాంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం సాయంత్రం శాస్త్రవేత్తలతో ఆయన సమీక్షించారు. చీడపీడలకు, ఏ వాతావరణానికి అయినా తట్టుకునేలా కంది, మిర్చి, పెసర, పత్తి విత్తనాలను రైతులకు అందించాలన్నారు. డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పరిశోధనలు జరుగుతున్న విధానంపై అడిగి తెలుసుకున్న మంత్రి యాంత్రీకరణపై పరిశోణలు చేయాలని చెప్పారు. హరిత విప్లవం, వ్యవసాయ పరిస్థితులు, పెట్టుబడులు పెరుగుదల వంటి అంశాలపై మంత్రికి అధికారులు వివరించారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టపరిహారంపై మంత్రికి వ్యవసాయాధికారులు వివరించారు. మంత్రి మాట్లాడుతూ నష్ట పరిహారం విడుదలకు ఇకెవైసి 92 శాతం పూర్తయిందని, గతంలో హెక్టారు (రెండున్నర ఎకరాలు) రూ.17 వేల పరిహారమిస్తే ఇప్పుడు రూ.25 వేలు ఇస్తున్నామన్నారు. జిల్లాలో 42,846 ఎకరాలు వరదలకు దెబ్బతిన్నాయని, రూ.42.98 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తామని తెలిపారు. సమీక్షలో ఎమ్మెల్యేలు బి.రామాంజనేయులు, టి.శ్రావణ్‌కుమార్‌, కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, జెసి భార్గవ్‌తేజ పాల్గొన్నారు.

➡️