పెరిగిన పోలింగ్‌..అభ్యర్థుల్లో టెన్షన్‌

May 14,2024 21:54

ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం అనూహ్యంగా పెరిగింది. ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు గంటల తరబడి క్యూలో ఉండి ఓట్లు వేశారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాలలో రాత్రి 8గంటల వరకు క్యూలో ఉండి ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లు కసితో ఓటు వేశారని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేయగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి మద్దతుగా ఓట్లు వేశారని వైసిపి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు ఎవరు పక్షాన తీర్పు ఇచ్చారో జూన్‌ 4న తేలనుంది. బొబ్బిలిలో 80.34శాతం పోలింగ్‌నియోజకవర్గంలో 80.34 శాతం పోలింగ్‌ అయింది. నియోజకవర్గంలో 2,31,232 మంది ఓటర్లు ఉండగా 1,85,774 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. బొబ్బిలి పట్టణం, మండలంలో 1,03,78 మంది ఓటర్లకు 81,282 మంది, బాడంగి మండలంలో 39,691మందికి, 32,508 మంది, రామభద్రపురం మండలంలో 38,371మందికి 32,135మంది, తెర్లాం మండలంలో 49,792మందికి 39,850మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. తరలి వచ్చిన వలస ఓటర్లుఓటుహక్కును వినియోగించుకునేందుకు వలస ఓటర్లు తరలి వచ్చారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు చేరుకున్నారు. వలస కార్మికులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు చర్చ జరుగుంది. నియోజకవర్గంలో మహిళలు ఓటింగ్‌ శాతం ఎక్కువ ఉంది. పెరిగిన మహిళ ఓటింగ్‌ వైసిపికి అనుకూలంగా ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగ యువత, వలస కార్మికులు ఓట్లు వేయగా సంక్షేమ పథకాలకు మద్దతుగా మహిళలు ఓట్లు వేసినట్లు చర్చ జరుగుతుంది. విజయం ఎవరిని వరిస్తుందోనియోజకవర్గంలో ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు వైసిపి, టిడిపి అభ్యర్థులు మధ్య పోటీ ఉంటుంది. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి తెంటు రాజాకు 76,629 ఓట్లు రాగా వైసిపి అభ్యర్థి సుజయకృష్ణ రంగారావుకు 83,587 ఓట్లు వచ్చి సుజయకృష్ణ రంగారావు 6,958 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు 84,955 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్థి సుజయకృష్ణ రంగారావుకు 76,603 ఓట్లు వచ్చి వైసిపి అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు 8,352ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరగడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడి కూటమికి అనుకూలంగా ఉంటుందని చర్చ జరుగుతుంది. నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో జూన్‌ 4 వరకు వేచి చూడాల్సిందే.బొబ్బిలిలో బేబినాయన విజయం ఖాయంనియోజకవర్గంలో కూటమి అభ్యర్ది బేబినాయన విజయం ఖాయమని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. కోటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన సమయంలో మంచి స్పందన లభించిందన్నారు. ప్రజల ఆదరణ మరువలేనిదని చెప్పారు. బేబినాయనపై ప్రజలకు మంచి నమ్మకం కనిపిస్తుందని చెప్పారు. జూన్‌ 4న వెలువడనున్న ఫలితాల్లో ఎమ్మెల్యేగా బేబినాయన, ఎమ్‌పిగా కలిశెట్టి అప్పలనాయుడు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు.కోటకు పోటెత్తిన టిడిపి కార్యకర్తలుకోటకు టిడిపి కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రక్రియను వివరించేందుకు ఉమ్మడి అభ్యర్ది బేబినాయన, మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావును కలిశారు. పోలింగ్‌లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టిడిపికి ప్రజలు ఓట్లు వేశారని వారంతా చెప్పారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో టిడిపి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని కూటమి నాయకులు, కార్యకర్తలు చెప్పారు. ఈ సందర్భంగా కూటమికి మద్దతుగా పని చేసిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలకు బేబినాయన, సుజయనాయన అభినందనలు చెప్పారు.

➡️