మైనర్‌ విద్యార్థులపై ఇండిపెండెంట్‌ అభ్యర్థి దాడి

May 25,2024 20:38

పోలీసుల అదుపులో అభ్యర్థి, అనుచరులు

ప్రజాశక్తి-రేగిడి  : సంతకవిటి మండలం డోలపేట వద్ద రాజాం నియోజకవర్గం ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఎన్ని రాజు, అతని అనుచరులు పెనుబాక గ్రామానికి చెందిన 7,9వ తరగతి చదువుతున్న విద్యార్థులు బండి యశ్వంత్‌, శేఖర్‌ లపై దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. రాజాం రూరల్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం.. పెనుబాక గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు డోలపేట వచ్చారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి కార్యాలయానికి ముందు ఒక కారు ఉండడంతో ఆ కారు వద్ద వారిద్దరూ నిల్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో రాజాం నియోజకవర్గం ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఎన్ని రాజు, తన ఇద్దరు అనుచరులతో కారు వద్దకు వచ్చి ఎందుకు ఇక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వీరిని దొంగతనం చేసిన వారిగా అనుమానించి కార్యాలయంలోనికి తీసుకువెళ్లి తలుపులు వేసి నిర్బంధించి తీవ్రంగా కొట్టారు.

ఈ విషయమై స్థానికులు సంతకవిటి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావుకు సమాచారం అందించడంతో హుటా హుటిన అక్కడికి చేరారు.. అక్కడే ఉన్న విద్యార్థులను ప్రశ్నించగా తాము డోలపేట వచ్చామని, కారు దగ్గర నిల్చుని ఉన్నామని తెలిపారు.. ఇంతలోనే ఇండిపెండెంట్‌ అభ్యర్థి కార్యాలయానికి తీసుకువెళ్లి కొట్టారని వివరించారు. విద్యార్థులకు గాయాలవ్వడంతో రాజాం ఏరియా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు ఇండిపెండింట్‌ కార్యాలయానికి చేరుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అభ్యర్థి ఎన్నిరాజుతో పాటు అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
➡️