ఆనందోత్సాహాలతో భోగి

Jan 13,2025 20:05

 సంప్రదాయాలను కొనసాగించాలి 

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

ప్రజాశక్తి -గజపతినగరం :  భోగి పండగను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో నిర్వహించారు. వేకువ జాముకు ముందుగానే లేచి సేకరించిన దుంగలను కుప్పలుగా పోసి భోగి మంటలు వెలిగించారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పలు ప్రాంతాల్లో యువత పెద్దఎత్తున వీధుల్లో భోగి మంటలు వేశారు. చాలా చోట్ల చిన్నారులు భోగి మంటల్లో పిడకలు వేసి ఆనందంగా జరుపుకున్నారు. గజపతినగరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రతి ఏటా నిర్వహిస్తున్న భోగి సంబరాలు సాంప్రదాయాన్ని కొనసాగించాలని రాష్ట్ర సూక్ష్మ ,చిన్న, మధ్య తరహామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక హైస్కూల్‌ గ్రౌండ్‌లో పూర్వ విద్యార్థులు నిర్వహించిన భోగి సంబరాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 20ఏళ్లగా అందరూ ఒకచోట కలుసుకుని భోగి సంబరాలు నిర్వహించడం మంచి సంప్రదాయం అన్నారు. ఇది భవిష్యత్‌ తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంద న్నారు. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు గజపతినగరం బడిలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ప్రతి ఏడాది దేశ, విదేశాల నుంచి కూడా రావడం ఎంతో ఆనందదాయకం అన్నారు. తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగువారి పండగల్లో ఎంతో విశిష్టమైన పండగ లో భోగి, సంక్రాంతి, కనుమ పండగలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. గజపతినగరం హైస్కూల్‌ గ్రౌండ్‌ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రౌండ్‌ చుట్టూరా లైటింగ్‌ సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం మర్రాపు వేణు మాస్టర్‌ను, వెటరన్‌ క్రికెటర్స్‌ పివివి గోపాల రాజు, రావి శ్రీధర్‌, కెఎన్‌ఎం శర్మ, తోనంగి శ్రీనివాసరావు, కర్రి నానాజీ, తంబి, కేెఎన్‌బి విజరు కుమార్‌, కన్రి అప్పారావులను పూలమాలలు, దుశ్శావలతో మంత్రి కొండపల్లి చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పివివి గోపాలరాజు, మాజీ ఎంపిపిలు మక్కువ శ్రీధర్‌, కంది తిరుపతి నాయుడు, టిడిపి సీనియర్‌ నాయకులు రావి శ్రీధర్‌, వివిప్రదీప్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

విజయనగరంటౌన్‌ : నగరంలో భోగి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. అన్ని వీధుల్లోనూ యువత, స్థానిక ప్రజలు పెద్దపెద్ద దుంగలు వేసి భోగి మంటలు వేశారు. చిన్నారులు పిడకలను మంటల్లో వేసి కేరింతలు కొట్టారు.

➡️