గత వైసిపి పాలనలో పారిశ్రామిక వేత్తలు పారిపోయారు : మంత్రి నిమ్మల

Jan 16,2025 16:36 #ramanaidu

ప్రజాశక్తి – పాలకొల్లు : గత వైసిపి ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు వెనక్కి వెళ్లడంతో పాటు పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూడాలంటే భయపడేవారని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. నేటి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం నుండి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి వస్తున్నాయని చెప్పారు. నేడు పాలకొల్లు నియోజకవర్గం 3 గ్రామాల్లో రూ 3.30 కోట్లతో సిమెంటు రోడ్లు, డ్రెన్లు, మంచినీటి సరఫరా నిర్మాణ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాడు జగన్ పాలనలో తాగే నీళ్లు సైతం కలుషితమై ఇంటి ముందు కల్లాపు వేసుకునేందుకు కూడా పనికి వచ్చేది కాదు. నేడు చంద్రబాబు ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి.  చంద్రబాబు పాలనలో జరిగే అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేని జగన్ సొంత విష పత్రిక ద్వారా అబద్ధాలు, అసత్యాలు రాయిస్తున్నారు’ అని  అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేసి 20 నుండి 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని చెప్పారు. చంద్రబాబు 2047 నాటికి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో మొదటి స్థానంలోకి తీసుకెళ్లాలనే విజన్ తో పనిచేస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పాల్గొన్నారు.

➡️