రూ 14 కోట్లతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు   : ఆర్‌జెడి

Mar 15,2025 20:50

ప్రజాశక్తి-రామభద్రపురం  : అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.14 కోట్లు వెచ్చిస్తుందని ఐసిడిఎస్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ చిన్మయిదేవి తెలిపారు. మండల కేంద్రంలో ఉన్న అంగన్వాడీ పాల సరఫరా కేంద్రాన్ని శనివారం ఆమె తనిఖీచేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామారాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్న 13 వేల 819 అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, ప్యాన్లు, లైట్లు వంటి సౌకర్యాల కల్పనకు ఈ నిధులు కేటాయించిందని తెలిపారు. మంచినీటి సౌకర్యానికి ఒక్కొక్క కేంద్రానికి రూ.17వేలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.35వేలు ఖర్చు చేస్తుందని తెలిపారు. 850 అంగన్వాడీ సెంటర్లలో ఆట వస్తువుల కోసం కోటి రూ.68 లక్షల 30వేలు అందజేస్తుందని తెలిపారు. మోడల్‌ అంగన్వాడీ సెంటర్ల వద్ద రైన్వాటర్‌ హార్వెస్టింగ్‌ ఫిట్స్‌ నిర్మాణానికి రూ.16వేలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. 3,173 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేయడానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. ఈ సందర్భంగా సరఫరా కేంద్రంలో ఉన్న స్టాకు రిజిస్టర్‌ను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గోదాము ఇన్‌ఛార్జి బండారు నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️