మధ్యవర్తిత్వంపై శిక్షణ ప్రారంభం

May 20,2024 23:45 #mediation training
Legal mediation training

 ప్రజాశక్తి-లీగల్‌ : జాతీయ న్యాయ సేవ ప్రాధికార సంస్థ ఆదేశానుసారం విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన ఉత్తరాంధ్ర న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. విశాఖపట్నం 10 న్యాయస్థానాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని కుటుంబ న్యాయస్థానం జిల్లా న్యాయమూర్తి రాధారత్నం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత పెరిగిందని, ఈ వ్యవస్థ సంతోషం, పరమం, సుఖం, అనే నినాదంతో కక్షిదారులకు కేసుల పరిష్కారం జరుగుతుందని ఆమె తెలిపారు. 2005 సంవత్సరంలో ఏర్పాటైన సుప్రీంకోర్డు మీడియేషన్‌ అండ్‌ కన్సీయేషన్‌ ప్రాజెక్ట్‌ కమిటీ ద్వారా దేశవ్యాప్తంగా న్యాయమూర్తులకు, న్యాయవాదులకు శిక్షణ ఇస్తూ తద్వారా కక్షిదారులకు కేసులు పరిష్కారం రాజీ పద్ధతిన జరుగుతుందన్నారు. ఈ శిక్షణ ఈ నెల 24వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, ఫస్ట్‌ అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సింధూర తెలిపారు. ఈ శిక్షణలో మధ్యవర్తిత్వం భావన పద్ధతులను నేర్పనున్నట్లు మీడియేషన్‌ కమిటీ మెంబర్‌ సావిత్రి వి లోకేష్‌ చంద్ర తెలిపారు. రోల్‌ ప్లేలు ద్వారా శిక్షణను ఇవ్వనున్నట్లు మరో మీడియా శిక్షణ మెంబర్‌ రోబర్టు వి అరుణ్‌ తెలిపారు. ఈ శిక్షణలో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లా న్యాయస్థానాల నుంచి 30 మందికిపైగా జిల్లా, సీనియర్‌, జూనియర్‌, న్యాయమూర్తులు పాల్గొన్నారు.

➡️