హామీల అమలు కోసం మున్సిపల్‌ కార్మికుల దీక్షలు

Jan 10,2025 23:57

దీక్షలను ఉద్దేసించి మాట్లాడుతున్న సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ఐలాండ్‌ సెంటర్‌ వద్ద శుక్రవారం రిలే దీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 16 రోజులపాటు సమ్మె చేయగా ప్రభుత్వం పలు హామీలను ఇచ్చిందని చెప్పారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలుకు, రిటైర్మెంట్‌ వయస్సు 62 ఏళ్లకు పెంపు, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, ప్రమాదవశాత్తు మరణిస్తే పరిహారాన్ని రూ.5 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంపుతోపాటు ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌గా వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే ఆ హామీలు ఇంకా అమలు కాలేదని, వాటిని సత్వరమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని, వారికి రావాల్సిన పరిహారం వెంటనే ఇవ్వాలని యూనిఫాం, సబ్బులు, నూనెలు, చెప్పులు ఇవ్వాలని కోరారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు జీవో 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఎన్‌ఎంఆర్‌, కోవిడ్‌ సమయంలో పనిచేసిన కార్మికులకు జీవో 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి ప్రజల కోసం పారిశుధ్య విధుల్లో కార్మికులు పని చేస్తున్నారని, ఈ సేవలను ప్రభుత్వాలు గుర్తించని కారణంగా పండగ రోజుల్లోనూ ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. దీక్షల్లో కార్మికులు మొగిలి ప్రతాప్‌, బత్తుల రామారావు, గుంటి నాగేశ్వరరావు, దేవరకొండ మార్తమ్మ, కంపా చిన్న వీరమ్మ, కుంభ కృష్ణవేణి, దేవళ్ల వెంకటేశ్వర్లు, గద్దె శ్రీను, కోపరి రమేష్‌, విజరు, వేముల శ్రీనివాసరావు, కొక్కెర శ్రీనివాసరావు, కంపా సురేష్‌, రామయ్య, రాగిరి శ్రీను, అనంతలక్ష్మి, కొమర గురవయ్య, పరస మేరీ, ప్రసన్న, గ్లోరీ, అన్నపూర్ణ దేవి, మేరమ్మ పాల్గొన్నారు.

➡️