ప్రజాశక్తి -మధురవాడ (విశాఖపట్నం) : చైతన్య కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ జిల్లా పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధి మారికివలసలో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక సిఐ బాలకృష్ణ కథనం ప్రకారం… విజయనగరం జిల్లా గరివిడి మండలం బద్రిప్రసాద్ కాలానికి చెందిన తిదా వేదాంత్ కార్తికేయ (15) ఇటీవల పదో తరగతి పరీక్ష రాశాడు. ఈ క్రమంలో జెఇఇ మెయిన్స్‌కు సన్నద్ధం చేసేందుకు కార్తీకేయను అతని తండ్రి అచ్యుతరావు ఈ నెల 13న మారికవలస శ్రీచైతన్య కళాశాలలో చేర్పించారు. తనకు హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేదని, ఇంటిలో ఉండి డేస్కాలర్‌గా చదుకుంటానని తల్లిదండ్రులకు కార్తీకేయ చెప్పాడు. దీంతో వారు మంగళవారం కాలేజీకి వచ్చి నచ్చజెప్పి వెళ్లారు. వారు వెళ్లిన తర్వాత తండ్రికి ఫోను చేసి తనకు హాస్టల్‌లో ఉండడం ఇష్టలేదని మరోసారి చెప్పాడు. దీంతో ఫస్టియర్ డేస్కాలర్‌గా, సెకెండియర్ హాస్టల్‌లో ఉండి చదువుకునేలా విద్యార్థిని తల్లిదండ్రులు ఒప్పించారు. కానీ బుధవారం ఉదయం కళాశాల హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కార్తికేయ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల సిబ్బంది వెంటనే ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
