ప్రజాశక్తి – వేంపల్లె (కడప) : స్థానిక రాజీవ్ నగర్ కాలనీలో షామీర్ కుమార్తె సానియా (21) అనే ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రంగారావు తెలిపారు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు … వేంపల్లెలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసముంటున్న షామీర్ కు సానియా అనే కుమార్తె ఉంది. ఆమె ఉర్దూ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నది. అయితే కుమార్తె సరిగ్గా చదువుకోకుండా కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దనే టివి చూస్తుడడంతో తండ్రి షామీర్ కోపపడి కళాశాలకు వెళ్లి బాగా చదువుకోవాలని కుమార్తెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన సానియా గత శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని చనిపోయినట్లు ఎస్‌ఐ తెలిపారు. తండ్రి షామీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సానియా మృతదేహాన్ని వేంపల్లె ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.