అంతర్రాష్ట్ర రహదారికి మరమ్మతులు చేపట్టాలి

Jun 10,2024 21:27

ప్రజాశక్తి – కొమరాడ : పార్వతీపురం నుండి కూనేరు వరకు వెళ్లే అంతర్‌ రాష్ట్ర రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కొమరాడలోని ఈశ్వరుని ఆలయం వద్ద రోడ్డుపై ఉన్న పెద్ద పెద్ద గోతుల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు, ప్రయాణికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సాంబమూర్తి మాట్లాడుతూ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గడిచిన రెండున్నరేళ్లుగా పాలకులకు, ఆర్‌అండ్‌బి అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడంలేదన్నారు. రోడ్డుపై ఉన్న గుమ్ములను వెంటనే కప్పాలని గతంలో నిరసన కార్యక్రమం చేసిన సందర్భంగా జూన్‌ 10లోగా గోతులు కప్పకపోతే నిరసన చేపట్టామన్నారు. అయితే ఇప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి మొండి వైఖరికి వ్యతిరేకంగా నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. గోతులు ఇంకుడు గుమ్ములుగా మారి వర్షం పడితే నీరు ఎక్కువగా చేరుకోవడం వల్ల అటు మూడు రాష్ట్రాలకు వెళ్లే వాహనదారులు ప్రయాణికులు ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి అనేకమంది చనిపోవడంతో పాటు, పలువురు క్షతగాత్రులయ్యారని అన్నారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బి అధికారులు స్పందించి గోతులను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే ఈనెల 20న అంతరాష్ట్ర రహదారి వద్ద రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గౌరినాయుడు, శివున్నాయుడు, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

➡️