అక్రమాలను సహించం

Jan 11,2025 00:11

ప్రాపర్టీ షోను ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :
నిర్మాణ రంగాన్ని నిలబెట్టేందుకు ఉచిత ఇసుక ఇస్తున్నామని సిఎం చంద్రబాబు చెప్పారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న నరెడ్కో ప్రాపర్జీ షోను సిఎం ప్రారంభించారు. పలు స్టాల్స్‌ను ఆయన ప్రారంభించి జ్యోతి ప్రజల్వన చేశారు. 12వ ప్రాపర్టీ షోలో ప్రముఖ రియల్టర్లు, మెటీరియల్‌ సప్లైర్లు, బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లు, లైజనింగ్‌ కన్సల్టెంట్లు, వాస్తు నిపుణులు, నిర్మాణ రంగ ప్రముఖులు హాజరైన సభలో సిఎం మాట్లాడుతూ ఎక్కడా ఇసుక అక్రమ రవాణాను అనుమతించమని దీనిపై ఇప్పటికే కలెక్టర్ల, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చాం. అధికారులు తప్పు చేసినా క్షమించను.’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దేశంలో ఏ రంగంలో మంచి అవకాశాలు వచ్చినా వాటిని అందిపుచ్చుకుని ముందుకెళ్లడంలో గుంటూరు జిల్లా వాసులు ఎప్పుడూ ముందుంటారని ‘ఐటీని అందిపుచ్చుకుని విదేశాలకు వెళ్లిన వారిలో గుంటూరు వాసులు ఎక్కువని చెప్పారు. బిల్డ్‌ ఏపీ నినాదంతో నిర్మాణ రంగాన్ని నిలబెట్టాలన్న లక్ష్యంతో పలు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్ల విధ్వంస పాలనలో పడకేసిన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాలన్న ధ్యేయంతో ఇసుకు ఉచితంగా ఇస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో ఎటు చూసినా విధ్వంసం… అంధకారమే కనబడిందన్నారు. ‘7 నెలల క్రితం వరకూ నిర్వీర్యమైన రాష్ట్రాన్ని చూశామని, అన్ని వ్యవస్థలు పతనమయ్యాయని, నిర్మాణ రంగమైతే గత ఐదేళ్లు అడ్రస్‌ లేకుండా పోయిందని అన్నారు. అందుకే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తే అన్ని రంగాల్లో రాష్ట్రాభివద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చామన్నారు. రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రధాని మోడీ రూ.2 లక్షల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు.రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధి చెందాలని, వారికి ఇబ్బంది లేకుండా చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచించారని అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో వారి సమస్యలపై పలు దఫాలు చర్చించటంతో పాటు, దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉన్న బెస్ట్‌ విధానాలను స్టడీ చేయాలని అధికారులను పంపించామని, వీటిపై ప్రత్యేక కమిటీలు వేసి చర్చించి నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ సలహాలు, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా మోడల్‌ బిల్డింగ్‌ బైలాస్‌కు అనుగుణంగా నిర్మాణ రంగంలో అనుమతుల నిబంధనలు సరళతరం చేస్తూ శుక్రవారం పురపాలక శాఖ జీవో జారీ చేసిందని వివరించారు. దీనిలో ముఖ్యంగా గ్రూప్‌ డెవలప్‌మెంట్‌ స్కీంకు ఉన్న రెగ్యూలైజేషన్‌ రూల్స్‌నే గ్రేటర్‌ కమ్యూనిటీలకు అమలు చేస్తామన్నారు. రైల్వే, రక్షణ శాఖల పరిధిలో నిర్మాణాలకు వారు నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ చేసిన దరఖాస్తులను సంబందిత శాఖల నుంచి ఎన్వోసీలతో సంబంధం లేకుండానే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. వాణిజ్య భవనాలతో పాటు 500 మీటర్లు పైన ఉన్న నివాస భవనాలకు సెల్లార్‌ నిర్మాణానికి అనుమతి ఇస్తామన్నారు. హైరైజ్‌ భవనాలు 55 -75 మీటర్ల ఎత్తు ఉన్న వాటికి 17 మీటర్లు, 70 -120 మీటర్లు ఎత్తు ఉన్నవాటికి 18 మీటర్లు, 120 మీటర్లు పైన వాటికి 20 మీటర్లు సెట్‌ బ్యాక్‌ను పరిమితం చేస్తూ ఉపసమనం కల్పించామని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో, ఇతర రాష్ట్రాల తరహా 10 అంతస్తుల దాటిన భవనాలకు ఎన్వీరాల్మెంట్‌ డెక్‌ను ఇస్తామని, దీనిలో ఫ్లవర్‌ గార్డెనింగ్‌, గ్రీనరి, యోగా, స్పా, వీవింగ్‌ గ్యాలరీ వంటి వాటిని వినియోగించుకునేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. రహదారుల విస్తరణ సమయంలో స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్‌ బాండ్లు జారీచేయక పోయినా కోల్పోయిన స్థలానికి సమానంగా వెంటనే నిర్మాణ చేసుకునే ప్రోవిజన్‌ ఇచ్చామన్నారు. 4000 చదరపు మీటర్లు గ్రూప్‌ డెవలప్‌మెంట్‌ లోని నిర్మాణాలకు 10 శాతం ఓపెన్‌ స్పేస్‌ స్థలంలోని 15 శాతం స్థలంలో స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. వ్యవసాయ జోన్‌లో పౌల్టీ ఫారమ్‌లు ఏర్పాటు చేసుకునేలా నిబంధనలు మార్పు చేశామని తెలిపారు. టీడీఆర్‌ బాండ్ల ఫైనల్‌ చేసే కమిటీలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలు వారిని తోలగించి మున్సిపల్‌ కమిషనర్‌ను, రీజినల్‌ టౌన్‌ ప్లానింగ్‌, స్థానిక టౌన్‌ ప్లానింగ్‌ అధికారులనే నియమించామని, యు ఎల్‌ బి లలో రెవెన్యూ ఆఫీసర్‌ చేర్చుతూ నిబంధనలు సులభతరం చేశామని తెలిపారు. లే అవుట్‌లలో నాన్‌ హైరేజ్‌ భవనాలకు వారి స్థలం ముందు రహదారికి ఇవ్వాల్సిన స్థలాన్ని వదిలిస్తే వారికి వెంటనే అనుమతులిచ్చేలా నిబంధనలు సడలించామన్నారు. గ్రూప్‌ డెవలెప్‌మెంట్‌ ఇళ్లకు కూడా వారి స్థలం వరకు రహదారి స్థలం వదిలేస్తే వారికి అనుమతులు మంజూరు చేస్తామన్నారు. హైరైజ్‌ భవనాల్లో ఆర్డీపీని త్వరగా రూపొందించి పూర్తిచేసి అనుమతిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లే అవుట్‌ల ఏర్పాటుకు ఈరోజు నుంచి రహదారికి 9 మీటర్లు స్థలం వదిలితే సరిపోతుందన్నారు. దీనిని అందరూ కచ్చితంగా పాటించాలన్నారు. ఎమినిటీస్‌లో క్లబ్‌ హౌస్‌, కన్వెన్షన్‌ హాలు కాకుండా మిక్సిడ్‌ హౌస్‌ అని పెడితే టౌన్‌ ప్లానింగ్‌లో పెండింగ్‌ లేకుండా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. జాతీయ రహదారుల పక్కన సర్వీస్‌ రోడ్డు అభివృద్ధి చెంది జాతీయ రహదారుల అధికారులు ఎన్వోసీ తీసుకుంటే 12 మీటర్లు రహదారికి ఇవ్వాల్సిన అవసరం లేదని, జాతీయ రహదారుల అధికారులు కోరితే మాత్రం 12 మీటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. దీనితో పాటు ఐదు అంతస్తుల భవనాలకు సెల్ఫ్‌ డిక్లేరేషన్‌ తోనే భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేలా జీవోను రెండు రోజుల్లో ఇవ్వనున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, ఎమ్‌డి నసీర్‌ అహ్మద్‌, బి.రామాంజనేయులు, నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.శ్రీనివాసులు, ఇండిస్టియల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డేగల ప్రభాకర్‌, రాష్ట్ర మాదిగ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉండవల్లి శ్రీదేవి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరు సజీలా, లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యరావు, నరెడ్కో నేషనల్‌ ప్రెసిడెంట్‌ జీవీ హరిబాబు, రాష్ట్ర అధ్యక్షులు గద్దె చక్రధర్‌, ప్రాపర్టీ షో చైర్మన్‌ గద్దె తిరుపతిరావు, రాష్ట్ర కార్యదర్శి మామిడి సీతారామయ్య, క్యాపిటల్‌ జోన్‌ ప్రెసిడెంట్‌ పెరవలి నాగవంశీ, కార్యదర్శి శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

➡️