ప్రజాశక్తి- కడప ప్రతినిధి/కడప అర్బన్ కేంద్ర బడ్జెట్ 2025-26 తీవ్ర నిరాశను కలిగించింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్‌ను శనివారం ప్రవేశపెట్టారు. కేంద్రంలోని బిజెపి, కూటమి సర్కారు ప్రాధాన్య తలకు అనుగుణంగా పోలవరం, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తావనకు మాత్రమే పరిమితమైంది. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, వెనుక బడిన ప్రాంతాలకు నిధుల ప్రస్తావన కనిపించకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలోని కూటమి సర్కారుకు నిర్లక్ష్యానికి పూర్తిస్థాయి బడ్జెట్‌లో చోటు లభించకపోవడం గమనార్హం. జిల్లాలో కూటమికి 11 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యం చేసింది. కిసాన్ కార్డుదారుల రుణ పరిమితి పెంపు, వేతన జీవులకు పన్ను రిబేటు సదుపాయాన్ని పెంచడం మినహా ఎటువంటి నిర్మాణాత్మక అభివృద్ధికి ఊతమివ్వక పోవడం గమనార్హం. రైల్వే బడ్జెట్‌లోనూ కడప-బెంగళూరు రైల్వేలైన్ సహా పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల ప్రస్తావనే కనిపించలేదు. కేంద్రబడ్జెట్ 2025-26 జిల్లావాసులను నిరాశపరిచింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు పెండింగ్ ప్రాజెక్టులకు కేటాయింపుల జాడే కనిపించలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలైన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గనుల కేటాయింపు, కడప-బెంగళూరు, కడప-విజయవాడ వంటి రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపుల ప్రస్తావనే కనిపించలేదు. ఉమ్మడి జిల్లాలోని ఐదు లక్షల మంది రైతులకు కిసాన్‌కార్డుల రుణ పరిమితిని రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షలు, ఎంఎస్‌ఎంఇలకు రూ.10 లక్షల వరకు పెంచింది. వేతన జీవుల ఆదాయ పన్ను శ్లాబుల్లో రూ.7.5 లక్షల పన్ను రిబేటును రూ.12.75 లక్షల పెంచడం స్వల్ప ఉపశ మనం కలిగించింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని 32 వేల మంది ఉద్యోగులు, 22,800 మంది లబ్ధి చేకూరునుంది. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లకు టిడిపి ఎంపీల మద్ధతు అవసరమైన నేపథ్యంలో గుడ్డిలో మెల్ల చందంగా వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల ప్రస్తావన మరిచింది. విశాఖ-చెన్నరు కారిడార్‌లో భాగంగా జిల్లా కేంద్రానికి సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడకు నీళ్లు, విద్యుత్, రోడ్డు, హైవేల ఏర్పాటు ప్రస్తావనే లేదు. జిల్లాలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులైన కడప-బెంగళూరు, కడప- విజయవాడ, ఓబుల వారిపల్లి- కృష్ణపట్నం సివిల్ రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపుల ప్రస్తావనే కనిపించలేదు.
