రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ ఉందా? : పుల్లారావు

May 16,2024 00:12

ప్రజాశక్తి – చిలకలూరిపేట : రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ అసలు ఉందా? లేదా? అని ఎన్‌డిఎ కూటమి తరుపున టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. స్థానిక తన నివాసంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో సరైన పాలనా వ్యవస్థ లేదని ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులు రామ్మోహన్‌ మిశ్రా, దీపక్‌ మిశ్రాలు ఇచ్చిన నివేదికలతో జగన్‌ ప్రభుత్వం, అతడి ప్రధాన కార్యదర్శి, పోలీస్‌ యంత్రాంగం తలలు ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు. ఎన్నికల సందర్భంలోనే ఇలా వ్యవహరించారంటే ఇక సాధారణ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దైన్యం ఏమిటో ఇప్పుడు అందరికీ అర్థమవుతోందని అన్నారు. పరిశీలకుల నివేదికలు, ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర డీజీపీ, ప్రధాన కార్యదర్శిలకు సమన్ల నేపథ్యంలో బుధవారం ఈసీ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ సందర్భంగానే ఆయన రాష్ట్రంలో పాలనా యంత్రాంగం పూర్తిగా గాడి తప్పిందని, శాంతిభద్రతలను గాలికి వదిలేశారని తాము చేస్తున్న ఫిర్యాదులకు ప్రస్తుత ఈసీ పరిశీలకుల నివేదికలే మరో తిరుగులేని సాక్ష్యమని చెప్పారు. పల్నాడు సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ రోజున అనంతరం చెలరేగిన హింసకు బాధ్యులైన వారు అందరు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర డీజీపీ, ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లను స్వాగతిస్తున్నామన్న ఆయన ఇప్పుడు ఈసీ తీసుకునే చర్యలు భవిష్యత్‌లో కూడా అందరికీ ఒక హెచ్చరికగా ఉండాలని అన్నారు. పోలింగ్‌ ముగిసి రోజులు గడుస్తున్నా హింసాగ్ని చల్లారక పోవడానికి వైసిపి కుట్రలు, క్షేత్రస్థాయి యంత్రాంగం వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారవడం వల్లనేనని విమర్శించారు. ముఖ్యంగా పల్నాడులో హింసకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు, కాసు మహేశ్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు పాత్రలపై అనేక ఆధారాలున్నా తొలుత పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారన్నారు.

➡️