పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : సమాజంలో తమ పని తాము చేసుకుంటూ ఎలాంటి ప్రచారం కోరుకొనని వ్యక్తులు ఉంటారని వారిని గుర్తించి అభినందించడం ద్వారా ఒక మంచి సందేశాన్ని విద్యా చైతన్య సమాఖ్య అందచేస్తున్నారని నరసాపురం ఆర్డీవో దాసి రాజు అన్నారు. పాలకొల్లు లైన్స్ కమ్యునిటీ హాల్లో సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం ఆదర్శ వ్యక్తులకు జరిగిన సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలాంటి వ్యక్తులను గుర్తించడం ద్వారా సమాజంలో మరింత మంది స్ఫూర్తి పొంది ఆ దిశగా తమ కఅషిని కొనసాగిస్తారని అన్నారు. తాను చేసే పనిని శ్రద్ధగా, సామాజిక బాధ్యతతో చేసేవారు ఆదర్శ వ్యక్తులు అవుతారని అన్నారు. సమాఖ్య ఉఫాధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యా చైతన్య సమాఖ్యను 2011లో ప్రారంభించామని అప్పటినుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణతో పాటు పరీక్షలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నామన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూత అందించడం, ఆయా రంగాలలో మెరుగైన సమాజం కోసం కఅషి చేస్తున్నారో వారిని గుర్తించి అభినందించడం లాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ సంవత్సరం వైద్యం విద్యారంగం, బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న ఐదుగురు ఆదర్శ వ్యక్తులను గుర్తించి అభినందిస్తున్నామని అన్నారు. అనంతరం తెలుగు భాషా పరిరక్షణకు పాటుపడుతున్న చల్లా మల్లికార్జున శర్మ, విద్యా రంగంలో విద్యార్థుల పట్ల ప్రేమ, శ్రద్ధ కనపరుస్తున్న ఉపాధ్యాయులు బుంగ జెస్సీ కళ, శెట్టి రామారావు, దొంగ చింతయ్య, బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న కంకిపాటి నాగరాజు లను సన్మానించారు. సమాఖ్య కార్యదర్శి పోలిశెట్టి శ్రీశ్రీ సన్మాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యవర్గ సభ్యులు మంచెం ఉమా మహేశ్వరరావు, గాంధీ తోలేటి, జవ్వాది నాగేశ్వర రావు,డి వి ప్రసాద్, మంచెం కనకరాజు, తదితరులు పర్యవేక్షించారు.