ఎన్నికల బాండ్లు నుండి రూ.కోట్ల వసూళ్లు చేసుకొని ప్రజలపై భారాలు వేయడం తగదు : సిపిఎం జోన్‌ కార్యదర్శి కృష్ణా రావు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఎన్నికల్లో కార్పొరేట్‌ సంస్థల నుండి కోట్లు రూపాయలు ఎన్నికల బాండ్లు ద్వారా సంపాదించుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చే విధంగా ప్రజల మీద భారాలు వేస్తున్నాయని సిపిఎం మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు తీవ్రంగా విమర్శించారు. సిపిఎం మద్దిలపాలెం జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం బస్టాండ్‌ వద్ద అధిక ధరలు నియంత్రంచాలని, బ్లాక్‌ మార్కెట్‌ అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి కృష్ణారావు మాట్లాడుతూ … కేంద్ర బిజెపి ప్రభుత్వం సుంకం 20 శాతం పెంచడం వలన వంట నూనె ధర లీటర్‌ పై 40 రూపాయలు పెరిగిందన్నారు. బియ్యం కేజీ 70 రూపాయలకు దాటిందని, కందిపప్పు, మినప్పప్పు, చింతపండు, పోపుదినుసులు, ఉల్లిపాయలు, టమాటా ఇతర కూరగాయల ధరలన్నీ భారీగా పెరిగి పేదల మోయలేని భారంగా ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు ధరలను అదుపు చేస్తామన్న ప్రభుత్వాలు ప్రజల మీద భారాల వేయడం సిగ్గుచేటు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కరెంటు సాధ్యుల భారీగా పెంచిందని బాదుడే బాదుడని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వేయడం తగదన్నారు. 2000 సంవత్సరంలో భారీగా ధరల పెంచిన చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నారని గుర్తు చేశారు. తక్షణమే అధిక ధరలు అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ధరలు పెరుగుదలకు నిరసనగా సిపిఎం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జోన్‌ నాయకులు జీవీఎం చలపతి, అనపర్తి అప్పారావు, పీతల అప్పారావు, పి వెంకట్రావు, ఎంవి త్రినాధరావు, సింహాచలం, జే ఆర్‌ నాయుడు, ఆర్‌ శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.

➡️