కెవిపిఎస్ రౌండ్ టేబుల్ లో పలువురు వక్తలు
ప్రజాశక్తి – కాకినాడ : భారతదేశంలో దళితులు, అట్టడుగు వర్గాల ప్రజలు, ఆదివాసీలు, మహిళలు, రైతులు, కార్మికులు మొదలగు ప్రజలందరికీ అండగా ఉండేది భారత రాజ్యాంగమేనని పలువురు వక్తలు కొనియాడారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో కాకినాడ టీచర్స్ హోమ్ లో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కే.సింహాచలం ఆహ్వానం పలుకగా, జిల్లా అధ్యక్షులు బి.సురేష్ కుమార్ సభకు అధ్యక్షత వహించారు. ముందుగా సంఘం ఉపాధ్యక్షులు కే.ఎస్.శ్రీనివాస్ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఉద్దేశాన్ని వివరించారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని, ప్రచారం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవం జరుపుతూ ఆచరణలో రాజ్యాంగాన్ని నీరుగారిస్తుందని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరులందరిపై ఉందని అందుకోసం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6 వరకు భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను జిల్లాలో ప్రచారం చేసి డిసెంబర్ 6 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముగింపు సభ జరుగుతుందని తెలియజేసారు. ఈ ప్రచార కార్యక్రమంలో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖ దళిత నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, సామాజిక సాధన సమితి ప్రెసిడెంట్ డాక్టర్ భానుమతి, ఐఎఫ్ టియు రాష్ట్ర నాయకులు జే.వెంకటేశ్వర్లు, ఆర్పిఐ రాష్ట్ర నాయకులు పిట్టా వరప్రసాద్, ఎస్సీ ఎస్టీ పోరం నాయకులు భయ్యా కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు, రిటైర్డ్ అగ్రికల్చరల్ జెడి పెట్ల సూర్యనారాయణ రాజు, రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరి రాజబాబు, కేవీపీఎస్ తాళ్లరేవు మండల కన్వీనర్ తిప్పర్తి శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ హయాంలో ఈ పదేళ్ల కాలంలో దేశంలో దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని, మతోన్మాద ప్రమాదం పెరిగిందని ప్రైవేటీకరణ విధానాలతో రిజర్వేషన్లకు అర్థం లేకుండా పోయిందని, రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడే ఇలా జరిగితే రాజ్యాంగం లేకపోతే దళితుల పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, గ్రామ గ్రామాన రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రచారం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు కూలీ సంఘం నాయకులు కే. అంజిబాబు, కెవిపిఎస్ నాయకులు పెడరిక్,ఏలేటి నాని బాబు, కటారి పద్మనాభం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.