ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : గత ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన జగనన్న కాలనీలలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి జె ఎన్ వి గోపాలన్ మండిపడ్డారు శుక్రవారం ఉండి మండలం మహదేవపట్నం గ్రామానికి చేరుకున్న సైకిల్ యాత్ర బృందానికి సిపిఎం మండల కార్యదర్శి చీర్ల శేషు ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎన్‌ఆర్పి అగ్రహారం, ఉండి జగనన్న కాలనీలలో పర్యటించిన సిపిఎం సైకిల్ యాత్ర బృందం దృష్టికి ప్రజలు పలు సమస్యలను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జెఎన్వి గోపాలన్ మాట్లాడుతూ ఎన్ ఆర్ పి అగ్రహారం లోని ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ఉండి మెయిన్ రోడ్ లోని పాలకేంద్రం వద్ద ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పిన నాటి తహసిల్దార్ నాయకులతో కుమ్మక్కై 222 మంది లబ్ధిదారులను మోసం చేసి వెలివర్రు గరువు లో ఇళ్ల నిర్మాణానికి పనికిరాని మౌలిక వసతులు లేని స్థలాలను కేటాయించారని మండిపడ్డారు. అదేవిధంగా ఉండి జగనన్న కాలనీలో సుమారు 653 మంది లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వగా మౌలిక వసతులు కల్పించకపోవడంతో కేవలం 50 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారని ఎప్పటికీ సుమారు ఒక్కొక్కరు 15 లక్షల రూపాయలు వరకు ఖర్చు చేసి ఇల్లు నిర్మించుకున్నారని కానీ వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. మంచినీరు పారిశుద్ధ్యం సమస్యలు నిరంతర ప్రక్రియ గా ఉన్నాయని వారానికోసారి మంచినీటి ట్యాంకర్ వస్తుందని, రేషన్ వ్యాను కాలనీకి రాకపోవడంతో వ్యాన్ ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడ పడిగాపులు కాస్తున్నామని, గ్యాస్ వ్యాన్ కూడా కాలనీకి రాకుండా చార్జీల పేరిట అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అక్కడి ప్రజలు తమ గోడును వెల్లబుచుకోవడంతో స్పందించిన జేఎన్వి గోపాలన్ మండల విస్తరణాధికారి చల్లా వెంకట సుదర్శన్ రెడ్డి తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు స్పందించిన మండల విస్తరణాధికారి సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగనన్న కాలనీలలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించాలని, మౌలిక వసతులు కల్పించాలని ఈనెల 17వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో జగనన్న కాలనీల ప్రజలు పాల్గని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సైకిల్ యాత్రకు ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు వై రాము సంఘీభావంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బురిడీ వాసుదేవరావు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి క్రాంతి బాబు, ప్రజా సంఘాల నాయకులు మునుకోలు వైకుంఠ రావు, జక్కం శెట్టి సత్యనారాయణ, ఆంజనేయులు, గొర్ల రామకృష్ణ, ధనికొండ శ్రీనివాస్, కొట్టాడ వెంకటేశ్వరరావు, చీర్ల శ్రీనివాస్, రామకూరి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
