పెన్షన్ల పంపిణీలో జగన్‌ మూర్ఖత్వం : ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలకు పంపిణీ చేసే పెన్షన్ల వ్యవహారంలో సీఎం జగన్‌ రాజకీయ లబ్ధితో మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పెన్షన్‌ సొమ్మును సచివాలయాల్లో పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే అన్నారు. ప్రస్తుతం ఎండలుఎక్కువగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలే గాని సచివాలయాల్లో ఇస్తామనడం జగన్‌ లో మానవత్వం లేనట్టుగా కనిపిస్తుందని విమర్శించారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు ఇచ్చినందున ప్రత్యామ్నాయంగా సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేయవచ్చునని ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలో 400 వరకు పెన్షన్లు ఉంటాయని 10 మంది వరకు ఉండే సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేస్తే 3 రోజుల్లో అందరికీ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు మురళీధర్‌ రెడ్డి, జవహర్‌ రెడ్డి లు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలకు పెన్షన్లు ఇంటింటికి వెళ్లి ఇచ్చేవరకు టిడిపి జనసేన బిజెపి కూటమి అండగా తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. జగన్‌ సీఎం కుర్చీ కోసం, అధికారం కోసం దిగజారుడుతనానికి పాల్పడుతున్నాడని విమర్శించారు.

➡️