పోలీసుల వలయంలో జమ్మలమడుగు

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ జిల్లా మొత్తం జమ్మలమడుగు వైపు పోలింగ్‌ రోజు నుంచి చూస్తా ఉంది. అంతే ఉత్కంఠగా జమ్మలమడుగు ప్రజలు క్షణక్షణం ఏం జరుగు తుందోనని భయాందోళనలో ఉన్నారు. పోలీసుల వలయంలో జమ్మలమడుగు పట్టణం, మండలం ఉన్నాయి. ఈనెల 13 పోలింగ్‌ రోజున జమ్మలమడుగు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఉదయం నుంచి జమ్మలమడుగు మండలంలో పెద్దదండ్లూరు, బొమ్మేపల్లి, పెద్దమోడియం మండలంలో సుద్దపల్లి, చిదిపిరాళ్లదిన్నె వంటి గ్రామాలలో చిన్న చిన్న సంఘటనలు జరిగినా ప్రశాంతంగా పోలింగ్‌ ముగుస్తుందని అందరూ భావించారు. అయితే రాత్రి 7 నుంచి 8 గంటలలోపల ఒక్కసారిగా జమ్మలమడుగు పేరు వినపడేలా ఘర్షణ వాతావరణం తలెత్తింది. పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలోని పోలింగ్‌ కేంద్రాలైన 116, 117 లలో ఓటర్లు ఓటింగ్‌ వేసేందుకు ఎక్కువగా ఉండడంతో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌ రెడ్డి, కూటమి పార్లమెంటు అభ్యర్థి భూపేష్‌ రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి అక్కడికి చేరుకున్నారు. చిన్నగా మొదలపై గొడవ చివరకు పెద్దదైంది. ఘర్షణలో ఎంపీ అభ్యర్ది భూపేష్‌ కిందపడడం, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై ఇటుక పెళ్లతో దాడి చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇరువురి నేతల వాహనాలు అద్దాలు పగలకొట్టారు. రంగ ప్రవేశం చేసిన డిఎస్‌పి యశ్వంత్‌ ఇరు పార్టీల నాయకులను సర్ధి జెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈనేపథ్యంలో వైసిపి, కూటమి నాయకులు ఆయా పార్టీ కార్యాలయాల వద్దకు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో పోలీసులు పార్టీ అభ్యర్థులను వారి సొంత గ్రామాలకు తరలించారు. అనంతరం జరిగిన పరిణామాలతో పట్టణంలో 144 సెక్షన్‌ కొనసాగుతుందని డిఎస్‌పి చెప్పారు. ఇదే మేరకు బుధవారం ఉదయం కలెక్టర్‌ విజయరామరాజు జమ్మలమడుగులో 144 సెక్షన్‌ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం రావడం చేత పోలీసుల అలర్ట్‌, పారా మిలిటరీ బలగాలను జమ్మలమడుగు తరలి ంచాలని ఆదేశించారు. జమ్మలమడుగులో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసు కోకుండా సమస్యాత్మక గ్రామాల్లో, పార్టీ కార్యాల యాల వద్ద, టీ అంగళ్లు, బస్‌ షెల్టర్లు, ప్రజలు గుమికూడే ప్రదేశాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 మంది అదనపు పోలీస్‌ బలగాలను జమ్మలమడుగుకు డిజిపి పంపించారు. రౌడీ మూకలు, ప్రయివేటు సైన్యం దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ మేరకు జమ్మలమడుగు పట్టణంలోనూ, గొరిగనూరు, ధర్మాపురం, పెద్ద దండ్లూరు, దేవగుడి, సున్నపురాళ్లపల్లి, పాటి (చిటిమిటి చింతల), ముద్దనూరు లతోపాటు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి సొంత గ్రామమైన నిడిజువ్విలో కూడా పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. దేవగుడి నుంచి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి, ఆదినారాయణ రెడ్డిని గ్రామం నుంచి బయటకు రాకుండా పోలీసులు పికెటింగ్‌ నిర్వహించారు. నిడి జువ్విలోనూ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి బయటకు రాకుం డా హౌస్‌ అరెస్టు చేశారు. మొత్తం పైన పోలీస్‌ బలగాలు అధిక సంఖ్యలో జమ్మలమడుగులో ఉండ డంతో ప్రజలలో భయాందోళన నెలకొంది. నియో జవర్గం మొత్తంపై జమ్మలమడుగులో హై టెన్షన్‌ ఏర్పడింది. ఎన్ని రోజులు ఈ పికెటింగ్‌, హైటెన్షన్‌ ఉంటుందని ప్రజలు చర్చించు కుంటున్నారు. వజ్ర వాహనం, పారా మిలటరీ, అదనపు పోలీస్‌ బలగాలతో జమ్మలమడుగు ప్రస్తుతం ఉంది. అవసరం ఉంటేనే తప్ప అనవ సరంగా బయట తిరగవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అనవసరమైన చర్చలు టీ షాపుల వద్ద, గుమికూడే ప్రదేశాలలో పెట్టవద్దని సూచిస్తున్నారు.

➡️