ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురష్కరించుకుని విజయనగరం బాలాజి నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ మహానీయుని చిత్రపటానికి జనసేన నాయకులు అవనాపు విక్రమ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరంలో సాయుధ పోరాటమే స్వతంత్ర సముపార్జనకు శరణ్యమని నమ్మి అలుపెరుగని పోరాటం చేశారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఘనత సుభాష్ చంద్రబోస్ కే దక్కుతుందన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరు అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధులు, సంఘసంస్కర్తల స్ఫూర్తితోనే ఉపముఖ్యమంత్రి & జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారని అన్నారు. జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, పార్టీ సిద్ధాంతాల మేరకు ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పత్తిగిల్లి వెంకటరావు, మండల సాయి లోకేష్, ముని లక్ష్మణరావు, నేరుడుబిల్లి చిన్నారావు, సంపత్ ఖాదర్, విశ్వ, కె.ఈశ్వరరావు, కె.రాజు, వీర మహిళలు దుప్పాడ జ్యోతి, గంట్ల పుష్ప కుమారి, పీతల లక్ష్మి, కాటం అశ్విని, జన సైనికులు పాల్గొన్నారు.
