2న ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయండి

2న ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయండి

ప్రజాశక్తి- సీతమ్మధార: విశాఖ ఉక్కు రక్షణకు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ వచ్చేనెల 2న నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వివి.రమణమూర్తి పిలుపునిచ్చారు. ఆ రోజున డాబాగార్డెన్స్‌ నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు నిర్వహించే ర్యాలీలో రాజకీయాలకు అతీతంగా పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. శుక్రవారం ద్వారకానగర్‌లో విశాఖ సిటిజన్‌ ఫోరం మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఒక క్రమపద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం యత్నిస్తోందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర ప్రజలపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వ పాలకులు కేంద్రం చర్యలను వ్యతిరేకించకుండా తలాడిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పథకాలకు, పాలనకు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని, అందులో రూ.పదివేల కోట్లను కేటాయించి, సొంతగనులు కేటాయిస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లాభాలబాట పడుతుందన్నారు. కానీ కేంద్రప్రభుత్వం అలా చేయకుండా, కావాలనే ప్రయివేటుకు ధారాదత్తం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే 2500మంది ఉద్యోగులకు విఆర్‌ఎస్‌ ఇస్తామని, మరో 500మందికి ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును నాటి ప్రధాని పివి.నరసింహారావు జాతికి అంకితం చేశారని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ మెడలు ఒంచైనా స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఉక్కు పరిరక్షణ ఉద్యమాలకు ప్రజల నుంచి స్వచ్ఛంద మద్దతు ఉందని గుర్తు చేశారు. విశాఖ సిటిజన్‌ ఫోరం గౌరవ అధ్యక్షులు పి వెంకటరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వ ఉబలాట చర్యలను కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు చైతన్యమై అడ్డుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేస్తున్న ఉక్కు రక్షణ ఉద్యమానికి విశాఖ సిటిజన్‌ ఫోరం మద్దతునిస్తుందన్నారు. సమావేశంలో ఫోరం అధ్యక్షులు పిఎన్‌ తిలక్‌, కార్యదర్శి పి. రామకృష్ణ, కోశాధికారి పి రాము పాల్గొన్నారు.

➡️